అసలు ఏం అభివృద్ధి చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి.. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్

కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న చంద్రబాబు తొత్తు, బినామీ రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపించారు.

Advertisement
Update:2023-03-07 17:01 IST

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే కొండగట్టు అభివృద్ధి చెందిందని టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తప్పుబట్టారు. అసలు అక్కడ ఏం అభివృద్ధి చేశారో ఒక సారి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొండగట్టుకు రూ.1000 కోట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్‌దే అని ఆయన కొనియాడారు. రేవంత్ రెడ్డి చేసేది పాదయాత్ర కాదని.. ఆయన చేసేది బస్సు యాత్రా? మరొకటా అని ప్రజలకు ఇంకా అయోమయంగానే ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న చంద్రబాబు తొత్తు, బినామీ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. ఆయన టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని బలి దేవతగా అభివర్ణించిన విషయాన్ని రవి శంకర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి బస్సులో యాత్ర చేస్తూ.. పాదయాత్ర అని చెబుతుంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీవన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కొండగట్టుకు ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేకపోయారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని ఆయన చెప్పారు. కాళేశ్వరం నీటితో చొప్పదండి నియోజకర్వగం సస్యశ్యామలం అయ్యిందని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు అధ్యక్షుడు అవ్వడానికి రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఇచ్చారని ఎమ్మెల్యే రవి శంకర్ ఆరోపించారు. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలోని ఏ నాయకుడిని అడిగినా చెప్తారన్నారు. జీవన్ రెడ్డిని అసలు కాంగ్రెస్ పార్టీ గుర్తించడం లేదని చెప్పారు. కొండగట్టు బస్సు ప్రమాద ఘటనపై ప్రతిపక్షాలు ఇష్టానుసారం మాట్లాడుతున్నాయని అన్నారు. మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు రవిశంకర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో ఐక్యత అనేదే కొరవడిందని.. ఎవరికి టికెట్ వస్తుందో తెలియక కార్యకర్తలు కూడా అయోమయానికి గురవుతున్నారని రవిశంకర్ అన్నారు. రేవంత్ రెడ్డికి దళితులంటే కనీస గౌరవం లేదని.. అంబేద్కర్ విగ్రహానికి పూలదండ కూడా వేయలేదని ఆయన చెప్పారు. చత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలుసుకోవాలని హితవు పలికారు. అవసరం అయితే మీ రాష్ట్రానికి వెళ్లి ఇక్కడి పథకాల గురించి వివరించాలని ఆయన సూచించారు.

Tags:    
Advertisement

Similar News