రేఖానాయక్ డబుల్ గేమ్.. బీఆర్ఎస్ రెబలా? కాంగ్రెస్ అభ్యర్థా?
కాంగ్రెస్ పార్టీలో తాను చేరడం లేదని.. బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల రేఖా నాయక్ ప్రకటించారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ డబుల్ గేమ్ ఆడుతున్నట్లే కనపడుతోంది. బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన రేఖా నాయక్‌కు సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరించారు. ఖానాపూర్‌లో రేఖా నాయక్ బదులు జాన్సన్ నాయక్‌కు టికెట్ ప్రకటించారు. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీపై అసమ్మతి గళం వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని అందరూ భావించారు.
కాంగ్రెస్ పార్టీలో తాను చేరడం లేదని.. బీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల రేఖా నాయక్ ప్రకటించారు. ఖానాపూర్‌లో బీఆర్ఎస్ క్యాడర్ అంతా తనవైపే ఉందని చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రెబెల్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు రెబెల్ క్యాండిడేట్ అని ప్రకటించుకున్న రేఖా నాయక్.. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయడానికి స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో కసరత్తు చేస్తోంది. రెండు రోజలుగా ఈ కమిటీ కసరత్తు సాగుతూనే ఉన్నది. ఈ క్రమంలో ఢిల్లీ స్థాయిలో టికెట్ కోసం రేఖా నాయక్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తున్నది. రెండు రోజులుగా ఆమె ఢిల్లీలోనే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. కానీ కాంగ్రెస్ టికెట్ కోసం ముఖ్య నాయకులతో లాబీయింగ్ చేయిస్తున్నట్లు తెలుస్తున్నది.
మరోవైపు రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. భర్త పార్టీలో చేరినా.. భార్య మాత్రం బీఆర్ఎస్‌లోనే ఉన్నారు. పైగా కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తుండటంతో రేఖా నాయక్ డబులో గేమ్ ఆడుతోందని నియోజకవర్గంలో చర్చ మొదలైంది. టికెట్ వస్తే కాంగ్రెస్ తరపున.. లేకపోతే బీఆర్ఎస్ రెబెల్‌గా పోటీకి దిగడానికే ఇలా డబుల్ గేమ్ ఆడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, రేఖానాయక్ శనివారం కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రేఖానాయక్ టికెట్ వచ్చినా, రాకపోయినా ఖానాపూర్ నుంచి బరిలో ఉంటారని ఆమె అనుచరుల పేర్కొంటున్నారు.