వాన వెలిసింది.. ముప్పు పొంచి ఉంది

వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా యంత్రాగం సమష్టి కృషితో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామన్నారు.

Advertisement
Update:2023-07-29 11:22 IST

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నీటమునిగిన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పలేం కానీ ముంపు ముప్పు మాత్రం తొలగిపోయిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడే అసలు సమస్య మొదలయ్యే అవకాశముంది. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని క్రమంగా సొంత గ్రామాలకు తరలించాలి. అక్కడ నివాసయోగ్యమైన వాతావరణం కల్పించాలి. దీనికోసం ప్రభుత్వ యంత్రాంగం కార్యాచరణ మొదలు పెట్టింది.

వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు భారీ వర్షాలు, వరదల ప్రభావం ఉన్న జిల్లాల్లో చేపట్టిన సహాయ, పునరావాస చర్యలు, ముందు జాగ్రత చర్యలపై ఆమె సమీక్ష చేపట్టారు. ఇప్పటివరకు వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు, జిల్లా యంత్రాగం మొత్తం చేసిన సమష్టి కృషితో ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. సిబ్బందిని ఆమె అభినందించారు. ఈరోజు కూడా ఇదే రకమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.


పునరావాస కేంద్రాల్లో బాధితులకు మౌలిక సదుపాయాల ఏర్పాటు, సరిపడా ఆహరం, మంచి నీరును ఏర్పాటు చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు సీఎస్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడే కొనసాగించాలని చెప్పారు. పునరావాస కార్యక్రమాలకు ఏవిధమైన సహాయం కావాలన్నా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్ స్పష్టం చేశారు.

చెరువులు, కుంటల పునరుద్ధరణ..

ఓవైపు ప్రజల జీవనం సజావుగా సాగేందుకు చర్యలు చేపడుతూనే, మరోవైపు ప్రకృతి విలయానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచిన చెరువులు, కుంటలను బాగుచేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. కట్టలు తెగిన చెరువుల మరమ్మతులు మొదలు పెట్టాలని అధికారులకు ఆదేశాలు అందాయి. అవకాశం ఉన్నచోట రోడ్ల మరమ్మతులు కూడా మొదలు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. 

Tags:    
Advertisement

Similar News