రీజినల్‌ రింగ్‌ రోడ్డు కేసీఆర్‌ మానస పుత్రిక

సీఎం, మంత్రులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు : మాజీ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

Advertisement
Update:2024-12-30 19:35 IST

రీజినల్‌ రింగ్‌ రోడ్డు కేసీఆర్‌ మానస పుత్రిక అని.. తాము చేయని పనిని చేశామని సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఎంతోమంది ఇంజనీర్లతో చర్చించి ట్రిపుల్‌ ఆర్‌ కు రూపకల్పన చేశామని చెప్పారు. హైదరాబాద్‌ ను కాస్మోపాలిటన్‌ సిటీగా అభివృద్ధి చేయడానికి వంది కి.మీ.ల రేడియస్‌ లో దీనిని ప్రతిపాదించామన్నారు. ఉత్తరభాగంలో 160 కి.మీ.లు, దక్షిణ భాగంలో 180 కి.మీ.లతో మొత్తం కలిపి రూ.27 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. 2017లోనే ఉత్తరం వైపు రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు సూత్రప్రాయం అంగీకారం కుదిరిందని తెలిపారు. భూసేకరణకు చేసే వ్యయంలో 50 శాతం భరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతోనే కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. 2018 ఆగస్టు 27న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో కేసీఆర్‌ చర్చలు జరిపారని తెలిపారు. భారత్‌ మాలా ప్రాజెక్టులో భాగంగా దీనిని చేపట్టడానికి 2019 అక్టోబర్‌ 14న కేంద్రం అంగీకారం తెలిపిందన్నారు. 2021 మార్చి 5న సీఎం కేసీఆర్‌, మంత్రిగా తాను కేంద్ర మంత్రి గడ్కరీని కలిశామని.. అదే ఏడాది డిసెంబర్‌ 6న అలైన్‌మెంట్‌ అప్రూవ్‌ చేసినా భూసేకరణకు రూ.2 వేల కోట్లు డిపాజిట్‌ చేయాలని కేంద్రం తిరకాసు పెట్టిందన్నారు. పలు దఫాలుగా చర్చల తర్వాత రూ.వంద కోట్లు డిపాజిట్‌ చేసి కేంద్రాన్ని ఒప్పించామని చెప్పారు. 2022 సెప్టెంబర్‌లో భూసేకరణకు అనుమతులు వస్తే ఏడాది పాటు భూమిని సేకరించామన్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించలేదన్నారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి కేంద్రం టెండర్లు పిలిస్తే అదేదో తమ గొప్పని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోడ్డుకు ఇప్పటికీ పర్మినెట్‌ నేషనల్‌ హైవే నంబర్‌ ఇవ్వలేదని, పర్యావరణ అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. దక్షిణం వైపు ట్రిపుల్‌ ఆర్‌ నిర్మాణానికి కేసీఆర్‌ హయాంలోనే సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అలైన్‌మెంట్‌ మార్చే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఇందులో ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ నాయకుల కుట్రలను ఆధారాలతో సహా బయట పెడుతామన్నారు. అలైన్‌మెంట్‌ మార్పు ద్వారా ప్రజలపై రూ.12,500 కోట్ల భారం మోపే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఎంతో చరిత్ర ఉన్న రావు బహద్దూర్‌ వెంకట రంగారెడ్డి సొసైటీకి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు ఎప్పుడైనా పట్టించుకున్నారా, ఏ రోజైనా ఒక్క రూపాయి ఇచ్చారా చెప్పాలన్నారు. సొసైటీ అభివృద్ధికి కేసీఆర్‌ కృషి చేశారని, రూ.500 కోట్ల విలువ చేసే పది ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు రూ.10 కోట్ల నగదు ఇచ్చారని తెలిపారు. నారాయణగూడలోని రెడ్డి హాస్టల్‌ పక్కనే ఉన్న మరో రూ.10 కోట్ల విలువైన 1200 గజాల స్థలాన్ని మహిళ హాస్టల్‌ కు కేటాయించారని గుర్తు చేశారు. అక్కడికి వెళ్లి కూడా కేసీఆర్‌ చేసిన పనులను తామే చేశామని చెప్పుకునేందుకు రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి ప్రయత్నించారని ఎద్దేవా చేశారు. సమావేశంలో ఎర్రోళ్ల శ్రీనివాస్‌, గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, కిషోర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News