పరిపాలనలో సంస్కరణలు అంటే ఆఫీసుల ఏర్పాటు మాత్రమే కాదు : సీఎం కేసీఆర్

కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తి చేసుకొని ఈ రోజు ప్రారంభించుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Update:2023-06-09 18:45 IST

పరిపాలనలో సంస్కరణలు అంటే కేవలం ఆఫీసులు ఏర్పాటు చేయడం మాత్రమే కాదని.. సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని.. దాన్ని పరిపాలనలో కూడా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కంప్యూటర్లు లేవు.. కానీ ఇప్పుడు ప్రతీ పనికి ఉపయోగిస్తున్నాము. రేపు ఇంకో కొత్త టెక్నాలజీ వస్తే దాన్ని కూడా మనం స్వీకరించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో మాట్లాడుతూ..

కొత్త కలెక్టరేట్‌ నిర్మాణం పూర్తి చేసుకొని ఈ రోజు ప్రారంభించుకున్న సందర్భంగా మంచిర్యాల జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తానని ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆనాడే చెప్పాను. కానీ అది సాకారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత చత్తీస్‌గడ్ మొదటి చీఫ్ సెక్రటరీగా పని చేసి రిటైర్ అయిన అధికారితో మాట్లాడాను. రాష్ట్రంలో భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాము. కానీ ఆయా జిల్లాల్లో ఒకటి, రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాలు వచ్చే అవకాశం లేదు. మరి ఏం చేయమంటారని అడిగానని కేసీఆర్ చెప్పారు. ఆ ప్రాంతాల్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో చూడొద్దని. ప్రజలకు అనుకూలంగా, పరిపాలన దగ్గర చేరువ చేయడానికి జిల్లాలను ఏర్పాటు చేయండని సూచించారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 33కు పెంచుకోగలిగామని సీఎం కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీరు, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ వంటి శాఖల్లో ఎన్నో సంస్కరణలు అమలు చేశాము. వాటి ఫలితాలు ఇప్పుడు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. 9 ఏళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలో అనేక విషయాల్లో నెంబర్ వన్‌గా నిలిచిందని అన్నారు. వరి ధాన్యం పండించడంలో పంజాబ్‌ను కూడా దాటిపోయామని.. పర్ క్యాపిటా ఇన్‌కమ్‌లో నెంబర్‌ వన్‌గా నిలిచామన్నారు. కరోనా, డీమానిటైజేషన్ వల్ల ప్రజలే కాకుండా ప్రభుత్వం కూడా ఇబ్బంది పడింది. అయినా మిగిలిన ఏడున్నర ఏళ్ల కాలంలో ఇంతటి అభివృద్ధిని సాధించడంలో అధికారుల కృషి, ప్రజల సహకారం కూడా ఉందని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణలో కుల, మతాలాకు అతీతంగా సంక్షేమ పథకాలు అందరికీ అమలు జరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి బీసీల్లో వెనుకబడిన చేతి వృత్తులు, కుల వృత్తుల వారికి రూ.1 లక్ష సాయాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించనున్నామని సీఎం అన్నారు. అలాగే రెండో విడత గొర్రెల పంపిణీని కూడా ప్రారంభిస్తున్నామని చెప్పారు. రెండో విడత గొర్రెల పంపిణీ అనంతరం రాజస్థాన్‌ను మించి అత్యధిక గొర్రెల సంఖ్య ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించబోతోందని సీఎం అన్నారు. అనంతరం రూ.1 లక్ష ఆర్థిక సాయం, గొర్రెల పంపిణీ లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం..

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఎగురవేసి.. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను కుర్చీలో కూర్చోబెట్టి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్యే బాల్క సుమ‌న్, దుర్గం చిన్న‌య్య‌, దివాక‌ర్ రావు, జోగు రామ‌న్న‌, రేఖా నాయ‌క్‌తో పాటు ప‌లువురు ప్రజాప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Tags:    
Advertisement

Similar News