హైదరాబాద్ లో డబ్బావాలాలు.. లంచ్ బాక్స్ లకు ర్యాపిడో సేవలు

వాస్తవానికి ర్యాపిడో లాంటి బైక్ సేవలు మనుషుల్ని ఒకచోటనుంచి ఇంకొక చోటకు చేర్చేందుకు ఉపయోగపడుతుంటాయి. కానీ ఇటీవల ఎవరైనా వస్తువులు మరచిపోయినా, ఏదైనా కొత్త ప్రదేశం నుంచి పార్శిల్స్ కావాలన్నా ర్యాపిడో యాప్ ని ఓపెన్ చేస్తున్నారు.

Advertisement
Update:2023-01-19 13:25 IST

హైదరాబాద్ లో డబ్బావాలాలు.. లంచ్ బాక్స్ లకు ర్యాపిడో సేవలు

ముంబైలో ఉద్యోగులకు లంచ్ బాక్స్ లు చేరవేయడంలో డబ్బా వాలాలు ఫేమస్. వేలాదిమందికి లంచ్ బాక్స్ లు ఇవ్వడం, ఖాళీ బాక్స్ లను ఇంటికి చేర్చడం వారి విధి. ఏళ్ల తరబడి ఆ వృత్తిలో ఉన్నా ఏనాడూ భోజన సమయం మించిపోరు, ఒకరి డబ్బా మరొకరికి మార్చి ఇవ్వరు. ఇదీ వారి స్పెషాలిటీ. ఇప్పుడు హైదరాబాద్ కి కూడా అలాంటి సంస్కృతి అలవాటవుతుందా..? అవుననే అంటున్నారు ర్యాపిడో ఉద్యోగులు. ఇటీవల కాలంలో లంచ్ బాక్స్ లు తెచ్చివ్వమనే ఉద్యోగులు ఎక్కువయ్యారట. ర్యాపిడో సేవలను లంచ్ బాక్స్ ల కోసం ఉపయోగించుకుంటున్నారట.

వాస్తవానికి ర్యాపిడో లాంటి బైక్ సేవలు మనుషుల్ని ఒకచోటనుంచి ఇంకొక చోటకు చేర్చేందుకు ఉపయోగపడుతుంటాయి. కానీ ఇటీవల ఎవరైనా వస్తువులు మరచిపోయినా, ఏదైనా కొత్త ప్రదేశం నుంచి పార్శిల్స్ కావాలన్నా ర్యాపిడో యాప్ ని ఓపెన్ చేస్తున్నారు. రైడ్ కి అవసరమైన సొమ్ము చెల్లిస్తే.. వస్తువులను కూడా ర్యాపిడో డ్రైవర్లు తీసుకొస్తుంటారు. ఈ క్రమంలో ఇప్పుడు లంచ్ బాక్స్ లకు ఇలాంటి డిమాండ్ పెరిగిందట.

హైదరాబాద్ లో ఇటీవల హైబ్రిడ్ మోడ్ వర్క్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినవారంతా ఇప్పుడు మెల్ల మెల్లగా ఆఫీస్ లకు అలవాటు పడుతున్నారు. ఇంటి భోజనానికి అలవాటు పడ్డారు కాబట్టి.. ఆ రెండు రోజులు కూడా ఇంటి దగ్గరనుంచే భోజనం తెప్పించుకోవాలనుకుంటున్నారు. దీనికోసం ర్యాపిడో సేవల్ని వాడుకుంటున్నారు. ఇతర విధుల్లో ఉన్నవారు, గతంలో లంచ్ బాక్స్ లు తీసుకెళ్లేవారు కూడా ఇప్పుడు ర్యాపిడోపై ఆధారపడుతున్నారు.

సమయానికి వేడి వేడి భోజనం ఇంటి దగ్గరనుంచి నిమిషాల వ్యవధిలోనే తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం బైక్ ట్యాక్సీలకు వచ్చే 100 కాల్స్ లో కనీసం 10 కాల్స్.. లంచ్ బాక్స్ లు, ఇతర వస్తువులకోసం వస్తున్నాయట. డబ్బావాలాలు అనే పేరు లేకపోయినా ఇప్పుడు హైదరాబాద్ లో బైక్ ట్యాక్సీలు మాత్రం అలాంటి సేవలే అందిస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News