బీఆర్ఎస్ వైపు విజయశాంతి చూపు!
దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు విజయశాంతి. కిషన్‌రెడ్డి మాటలతో అది స్పష్టమవుతోందన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో BRS ఉండదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. దక్షిణాది రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు విజయశాంతి. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు, ప్రజల మనోభావాలు, వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వ్యవహరిస్తున్న వారికి.. కరుణానిధి, MGR, NTR, జయలలిత నుంచి ఇప్పుడున్న BRS, వైసీపీ సమాధానం అన్నారు. దీనిపై బీజేపీ విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నారు విజయశాంతి.
కాంగ్రెస్‌పై అసంతృప్తి..
దక్షిణాది గురించి కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు.. బీజేపీ కనీసం ఆలోచన కూడా చేయట్లేదన్నారు విజయశాంతి. కిషన్‌రెడ్డి మాటలతో అది స్పష్టమవుతోందన్నారు. విజయశాంతి ట్వీట్ పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారి తీసింది. జాతీయ పార్టీలో ఉంటూ ప్రాంతీయ పార్టీలను పొగడటంపై డిస్కషన్ నడుస్తోంది. కాంగ్రెస్‌లో చేరినప్పటినుంచి సైలెంట్‌గానే ఉన్నారు విజయశాంతి. ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారనే వార్తలు వినిపించినా.. కనీసం ప్రచారంలో కూడా పాల్గొనలేదు. కాంగ్రెస్‌లో రాములమ్మ అసంతృప్తిగా ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. తాజా ట్వీట్‌తో అది మరింత బలపడిండి.
ఈనేపథ్యంలో విజయశాంతి మళ్లీ గులాబీ గూటికి చేరబోతారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశారు విజయశాంతి. కేసీఆర్‌కు సన్నిహితురాలిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత పరిణామాలతో ఆమె పలు పార్టీలు మారుతూ వస్తున్నారు.