రాజ్యసభ ఎన్నికలు.. టీ.కాంగ్రెస్ నేతలకు నిరాశేనా..?

ప్రస్తుతం CWC సభ్యుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి అజయ్‌ మాకెన్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని హస్తం పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.

Advertisement
Update:2024-02-13 10:23 IST

తెలంగాణ రాజ్యసభ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేసింది కాంగ్రెస్‌. నేడో, రేపో అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. తెలంగాణ నుంచి మొత్తం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాగా.. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఉన్న బలం ప్రకారం రెండు స్థానాలు దక్కనున్నాయి.

ఈ రెండు స్థానాల్లో ఒక స్థానానికి AICC నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం CWC సభ్యుడిగా ఉన్న మాజీ కేంద్ర మంత్రి అజయ్‌ మాకెన్‌ను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపాలని హస్తం పార్టీ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది. ఈనెల 15న అజయ్ మాకెన్‌ హైదరాబాద్‌ రానున్నారని స‌మాచారం. అభ్యర్థిగా ఎంపిక చేస్తే అదే రోజు నామినేషన్ వేస్తారని వినికిడి.

ఇక మరో సీటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మాజీ ఎంపీ వీహెచ్‌తో పాటు పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, మాజీ మంత్రి జానారెడ్డి, చిన్నారెడ్డి రాజ్యసభ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, జోగినిపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ మూడు స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు, బీఆర్ఎస్‌కు ఒక్క స్థానం దక్కే అవకాశాలున్నాయి.

Tags:    
Advertisement

Similar News