లక్ష్మీదేవి, కమలం, కమలం పువ్వు గుర్తు..
బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారని, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజల్ని కోరారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.
ఎన్నికల్లో తిరిగి గెలిచి అధికారం నిలుపుకోవాలంటే అప్పటి వరకూ చేసిన మంచి పనులేంటో నేతలు చెప్పాలి. విపక్షాలు ఎన్నికల్లో గెలిచి అధికారం చేజిక్కించుకోవాలంటే.. తాము వస్తే ఏం చేస్తామనేది చెప్పాల్సి ఉంటుంది. పోనీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేసిన మంచి పనుల్ని ఏకరువు పెట్టాలి. కానీ తెలంగాణలో బీజేపీ జాతీయ నేతల ప్రచారం మాత్రం కామెడీగా ఉంది. లక్ష్మీదేవి, కమలం, కమలం పువ్వు గుర్తు.. అంటూ కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ విచిత్రమైన లాజిక్ చెప్పారు. లక్ష్మీదేవి కమలంపై కూర్చుంటుందని.. కమలం గుర్తుకు ఓటేస్తే అంతా శుభమే జరుగుతుందని అన్నారు. ఆ విధంగా ఆయన బీజేపీకి ఓటు వేయాలని సూచించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ధరణి పోర్టల్ తీసుకు వచ్చి.. తెలంగాణ రాష్ట్రంలో లక్షల ఎకరాల భూములను మాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ స్వామిత్ర పథకం బాగుందని కితాబిచ్చారు. ఆ పథకం ద్వారా ప్రతి ఒక్కరికి భూమి హక్కులు ఇచ్చామని చెప్పారు. శాటిలైట్ ఆధారంగా హద్దులు నిర్ణయించి, వివాదాలు లేకుండా చేస్తున్నామని చెప్పారు.
ఒక్క ఛాన్స్..
తెలంగాణలోనూ అభివృద్ధి జరగాలంటే, పేదలకు మంచి జరగాలంటే మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని పిలుపునిచ్చారు రాజ్ నాథ్ సింగ్. బీఆర్ఎస్ పార్టీకి రెండుసార్లు అవకాశం ఇచ్చారని, బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజల్ని కోరారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు రూపాయి ఇస్తే.. 20 పైసలు మాత్రమే వారి దగ్గరకు చేరేదని.. మోదీ హయాంలో నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బులు పడుతున్నాయని వివరించారు. అంతా బాగానే ఉంది కానీ, అభ్యర్థుల జాబితా విషయంలో బీజేపీ పూర్తిగా వెనకపడిపోవడంతో.. బీజేపీ సభలకు పెద్దగా జనాదరణ లేకుండా పోయింది.