నిన్నటి వరకు కేసీఆర్ మీద సవాళ్లు.. ఓటమితో రూటు మార్చిన రాజగోపాల్ రెడ్డి

బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ మునుగోడులో నైతికంగా తానే విజయం సాధించానని చెప్పుకొచ్చారు. బీజేపీని బలోపేతం చేసేందుకు తాను బరిలోకి దిగుతున్నారని అన్నారు.

Advertisement
Update:2022-11-11 19:03 IST

మునుగోడు ఉపఎన్నిక ఫలితం వచ్చే వరకు సీఎం కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడిన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమి తర్వాత రూటు మార్చారు. ఇప్పుడు కేసీఆర్‌ను కాకుండా మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి జగదీశ్ రెడ్డి గెలవకుండా చేస్తానని సవాల్ చేశారు. మునుగోడులో తాను ఒక్కడినే ఒంటరిగా కష్టపడ్డానని.. టీఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను రంగంలోకి దింపి తనను ఓడించిందని ఆరోపించారు. మునుగోడులో ధర్మ యుద్దం జరగలేదని.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని టీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ మునుగోడులో నైతికంగా తానే విజయం సాధించానని చెప్పుకొచ్చారు. బీజేపీని బలోపేతం చేసేందుకు తాను బరిలోకి దిగుతున్నారని అన్నారు. సూర్యాపేట నుంచే బీజేపీని బలోపేతం చేస్తానని వెల్లడించారు. మునుగోడుకు వచ్చి తనను జగదీశ్ రెడ్డి ఎలా ఓడగొట్టారో.. సూర్యపేటకు వెళ్లి తాను ఓడిస్తానని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మునుగోడు నుంచే పోటీ చేస్తాను. కానీ సూర్యపేటకు మాత్రం ఇక్కడి నుంచి మనుషులను పంపి జగదీశ్ రెడ్డిని ఓడించేందుకు వ్యూహం రచిస్తానని వివరించారు.

తాను ఓడినా మునుగోడు ప్రజలకు అందుబాటులో ఉంటానని రాజగోపాల్ అన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీజేపీ బలపడుతుందని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మునుగోడులో రోడ్లు సక్రమంగా లేవని.. దీనికి టీఆర్ఎస్ పార్టీనే కారణమని ఆరోపించారు. కాగా, నిన్నటి వరకు మునుగోడు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి రోడ్లు బాలేవని విమర్శించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రూ. 18వేల కోట్ల కాంట్రాక్టు వల్లే బీజేపీలో చేరి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని స్థానికులు చెప్పుకుంటున్నారు. కానీ, రాజగోపాల్ మాత్రం రోడ్లు బాలేవు, అభివృద్ధి జరగలేదని టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం గమనార్హం. ఓడిపోయినా మళ్లీ అవే అబద్దాలు పదే పదే వల్లె వేస్తుండటం రాజకీయ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

కాంగ్రెస్ బలహీనపడాలనే వచ్చా...

దేశంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడితే కేంద్రంలో మళ్లీ మోడీ ప్రభుత్వమే వస్తుంది. బీజేపీ వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసేలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు విమర్శించారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి అదే విధంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తాను కాంగ్రెస్ బలహీన పడటానికే బీజేపీలో చేరానని మీడియా సాక్షిగా వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Tags:    
Advertisement

Similar News