రాజాసింగ్‌పై పీడీ యాక్ట్.. పత్రాలు హిందీలో లేవంటూ హైకోర్టు మెట్లెక్కిన భార్య ఉష
పీడీ యాక్ట్ నమోదు, అరెస్టు సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన సూత్రాలు, మార్గ దర్శకాలను పోలీసు అధికారులు పాటించలేదని పిటిషన్‌లో ఆరోపించారు. అరెస్టు సమయంలో సంబంధిత పత్రాలు హిందీలో లేవని ఆమె అన్నారు.
హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టారనే కారణంతో గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మహ్మద్ ప్రవక్తపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే రాజాసింగ్ అరెస్టులో పోలీసులు నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంటూ భార్య ఉషా బాయి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద.. తన భర్తను నిబంధనలు ఉల్లంఘించి అరెస్టు చేశారని, ఆయనపై పీడీ యాక్ట్ ఉపసంహరించి.. విడుదల చేయాలని ఆమె పిటిషన్‌లో కోరారు.
పీడీ యాక్ట్ నమోదు, అరెస్టు సమయంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన సూత్రాలు, మార్గ దర్శకాలను పోలీసు అధికారులు పాటించలేదని పిటిషన్‌లో ఆరోపించారు. అరెస్టు సమయంలో సంబంధిత పత్రాలు హిందీలో లేవని ఆమె అన్నారు. నిర్బంధానికి గురైన వ్యక్తి మాతృభాషలోనే పీడీ యాక్ట్ ఉత్తర్వులు ఉండాలని సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన మార్గ దర్శకాలను ఆమె పిటిషన్‌లో గుర్తు చేశారు. అంతే కాకుండా ఈ విషయంపై అడ్వైజరీ కమిటీ ముందు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వడానికి హైదరాబాద్ పోలీసులు తనకు సమయం ఇవ్వలేదని కూడా చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన భర్తను పోలీసులు గూండాగా అభివర్ణించడంపై ఉషా బాయి అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన భర్తపై పీడీ యాక్ట్ నమోదు చేయడం వెనుక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. కొంత మంది వ్యక్తులను సంతృప్తి పరచడానికే ఈ యాక్ట్‌ను ప్రయోగించినట్లు ఉషా బాయి తెలిపారు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం తెలంగాణ పోలీసుల అసమర్థతకు అద్దం పడుతోందని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. గత నెల 23న రాజాసింగ్‌ను మొదటి సారి అరెస్టు చేయగా.. నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. కానీ మూడు రోజుల తర్వాత పీడీ యాక్ట్ కింద ఆయనను అరెస్టు చేశారని.. ఇందులో కుట్ర ఉన్నదని ఆమె పేర్కొన్నారు. కాగా, పీడీ యాక్ట్ కింద అరెస్టు చేస్తున్నట్లు రాజా సింగ్‌కు పోలీసులు చెప్పారని, పత్రాలు హిందీ భాషలోనే ఉండాల్సిన అవసరం లేదని.. ఇంగ్లీషులో కూడా నోటీసులు ఇవ్వొచ్చని పోలీసులు అంటున్నారు. కాగా, కోర్టు ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరుపనున్నట్లు తెలుస్తుంది.