పార్టీ అడుగుతోంది కానీ.. ఎంపీగా పోటీకి ఆసక్తి లేదన్న రాజాసింగ్
బీజేపీ శాసనసభాపక్షనేత పదవి కోసం గట్టిగానే పోటీపడిన రాజాసింగ్ చివరకు ఆ పదవి మహేశ్వర్‌రెడ్డికి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపైనా ఆసక్తికర కామెంట్లు చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రాజాసింగ్ మనసులో మాట చెప్పేశారు. పార్టీ తనను జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని చెబుతోందన్నారు.. కానీ తనకు ఆసక్తి లేదని స్పష్టం చేసేశారు. అయితే హిందూరాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
సంజయ్, కిషన్‌రెడ్డికి ప్రచారం చేస్తా
తమ పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కోసం కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తానని రాజాసింగ్ చెప్పారు. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలిస్తే సికింద్రాబాద్ కూడా ప్రచారం చేస్తానని అన్నారు.
బీజేఎల్పీ పదవిపై ఆసక్తి లేదట!
బీజేపీ శాసనసభాపక్షనేత పదవి కోసం గట్టిగానే పోటీపడిన రాజాసింగ్ చివరకు ఆ పదవి మహేశ్వర్‌రెడ్డికి దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో దానిపైనా ఆసక్తికర కామెంట్లు చేశారు. బీజేఎల్పీ పదవిపై తనకు ఆసక్తి లేదన్నారు. ఎవరో ఒకర్ని.. ఫ్లోర్ లీడర్‌గా త్వరగా ఎంపిక చేస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు. బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశామన్న రాజాసింగ్ ఎల్పీ పదవి బీసీకిస్తే బాగుంటుందని జాతీయ నాయకత్వం అనుకుంటోందని చెప్పుకొచ్చారు. అయితే అది ఆయన మనసులో మాటేమో మరి!