నామినేషన్ వేసేందుకు రాజగోపాల్ రెడ్డి ఉరుకులు, పరుగులు

రాజగోపాల్ రెడ్డి హడావిడి పడ్డారు. వాహనంలోనుంచి దిగి నామినేషన్ పత్రాలు తీసుకుని ఆర్వో కార్యాలయం వైపు పరుగులు పెట్టారు.

Advertisement
Update:2023-11-09 18:08 IST

నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్ లోకి రానివ్వరు అనే నిబంధన ఉన్నప్పుడు విద్యార్థులు ఉరుకులు పరుగులు పెట్టడం చూస్తూనే ఉంటాం. సరిగ్గా అలాగే ఈరోజు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేసేందుకు పరుగులు పెట్టారు. నామినేషన్ దాఖలుకు టైమ్ ముగుస్తుండటంతో ఆయన హడావిడి పడ్డారు. ఆయనతోపాటు అనుచరులు కూడా పరుగులు పెట్టి లోపలికి వెళ్లారు. చివరకు టైమ్ సరిపోవడంతో ఆయన నామినేషన్ వేసి బయటకు వచ్చారు.

ఎందుకీ హడావిడి..?

నామినేషన్ వేసేందుకు రేపు ఆఖరు తేది. అయితే ఈరోజు మంచి ముహూర్తం ఉండటంతో చాలామంది కీలక నేతలు ఇవాళే తమ నామినేషన్లు వేశారు. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు, ఆలస్యమైతే మరుసటి రోజు రావాల్సిందే. ఈరోజు నామినేషన్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్న రాజగోపాల్ రెడ్డి, మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వచ్చారు. అప్పటికే టైమ్ 3 గంటలు అవుతోంది. ఆఫీస్ కి 500 మీటర్ల దూరం వరకే వాహనాలను అనుమతించారు పోలీసులు. దీంతో ఆయన హడావిడి పడ్డారు. వాహనంలోనుంచి దిగి నామినేషన్ పత్రాలు తీసుకుని ఆర్వో కార్యాలయం వైపు పరుగులు పెట్టారు.

ర్యాలీతో ఆలస్యం..

కొంతమంది నాయకులు నామినేషన్ల తర్వాత ర్యాలీ పెట్టుకుంటారు, మరికొందరు నామినేషన్ వేసేందుకే ర్యాలీగా బయలుదేరి వెళ్తారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఈరోజు బలప్రదర్శన చేశారు. భారీ ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో పడి ఆయన టైమ్ చూసుకోలేదు. తీరా టైమ్ దగ్గరపడేసరికి ఆయన హడావిడిగా ఆర్వో కార్యాలయానికి వెళ్లారు. దూరంగా వాహనాలు పెట్టాల్సి రావడంతో అక్కడినుంచి నడిచి వెళ్తే సమయం మించిపోతుందనే ఉద్దేశంతో పరుగు అందుకున్నారు. ఆయనతోపాటు కొంతమంది నాయకులు, వ్యక్తిగత సిబ్బంది కూడా పరుగులు తీశారు. 

Tags:    
Advertisement

Similar News