మాల్ మసాలా వ్యాఖ్యలు.. మళ్లీ బుక్కైన రాజగోపాల్ రెడ్డి

ఎన్నికల్లో ఓట్లను నోట్లతో కొనుగోలు చేయాలని డిసైడ్ అయినట్టున్నారు రాజగోపాల్ రెడ్డి. అందుకే తనది పెద్ద చెయ్యి అని పదే పదే చెప్పుకుంటున్నారు.

Advertisement
Update:2023-11-06 15:01 IST

బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నారు. తాను ఏ పార్టీకి అమ్ముడుపోలేదని, బీజేపీలో చేరినా చివరకు కాంగ్రెస్ గూటికే వచ్చాకదా అంటూ ఆమధ్య ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాజాగా ఆయన మాల్ మసాలా అంటూ చేసిన ప్రసంగం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ రాజగోపాల్ రెడ్డి దృష్టిలో మాల్ మసాలా అంటే ఏంటి..?

సభలో ప్రసంగించాల్సింది నేనే, సభ అయిపోయాక అందరికీ మాల్ తయారు చేయాల్సింది కూడా నేనే నంటూ మునుగోడు ప్రచార సభలో మాట్లాడారు రాజగోపాల్ రెడ్డి. అందరికీ మాల్ మసాలా చూసుకోవాల్సింది నేనే కదా అని ఆయన అక్కడున్నవారందర్నీ ప్రశ్నించారు. మాల్ అంటూ ఆయన చేతులు ఊపుతూ చేసిన సిగ్నల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


నాది పెద్ద చెయ్యి..

ఎన్నికల్లో ఓట్లను నోట్లతో కొనుగోలు చేయాలని డిసైడ్ అయినట్టున్నారు రాజగోపాల్ రెడ్డి. అందుకే తనది పెద్ద చెయ్యి అని పదే పదే చెప్పుకుంటున్నారు. పది వేలు అడుగుదామని వచ్చే వాళ్లు కూడా తన ఇల్లు, క్యాంప్ ఆఫీస్ చూసి లక్షల్లో అడుగుతున్నారని చెప్పారు. తాను ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఇలాగే అడిగారని అన్నారు. మొత్తమ్మీద తనతోపాటు ఎన్నికల ప్రచారానికి వచ్చేవారికి బాగానే ముట్టజెబుతున్నట్టు ఆయనే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక పోలింగ్ రోజు కూడా ఆయన ధారాళంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత బాహాటంగా డబ్బు పంపిణీ గురించి చెబుతున్న రాజగోపాల్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలంటున్నారు నెటిజన్లు. 


Tags:    
Advertisement

Similar News