తగ్గేదే లేదంటున్న రాజా సింగ్.. పోలీసు కేసు పై ఆగ్రహం
బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని రాజాసింగ్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఓవైసీల మెప్పు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.
తన తుది శ్వాస వరకూ రామ నామ జపం చేస్తూనే వుంటానని.. హిందూ ధర్మం కోసం తూటాలకైనా ఎదురు వెళ్తానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. తనపై పోలీసులు మరో కేసు నమోదు చేయడంపై ఆయన స్పందించారు. బాబ్రీ మసీదుపై ఓవైసీ సోదరులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా వారిపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, ఓవైసీల మెప్పు కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. అందుకే తనపై కేసులు పెడుతున్నారని ఆయన విమర్శించారు.
సోషల్ మీడియాలో ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలు ప్రత్యేకంగా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేస్తున్నట్లుగా వున్నాయని పోలీసులు పేర్కొన్నారు. హైకోర్ట్ విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని పోలీసులు పేర్కొన్నారు. రెండు రోజుల్లోగా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీస్‌లో ఆదేశించారు. ఈ ఆరోపణలను రాజాసింగ్ తరపున ఆయన న్యాయవాది జవాబిచ్చినా దీనిపై పోలీసులు సంతృప్తి చెందలేదు. దీంతో మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
గతంలో ఆయన మహ్మద్ ప్రవక్త పై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై పిడి యాక్ట్ ప్రయోగించి అరెస్టు చేశారు. రెండు నెలల తర్వాత హైకోర్టు ఉత్తర్వులతో ఆయన గతనెలలో విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఆయన మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.