లెవల్ క్రాసింగ్ లేని రైల్వే లైన్లు.. తెలంగాణ నుంచే ప్రయోగం

కొత్తగా వేసే జాతీయ రహదారుల్లో లెవల్ క్రాసింగ్ లు దాదాపుగా కనిపించవు. ఇదే విధానాన్ని రైల్వే నూతన లైన్లలో కూడా అమలు చేయాలనుకుంటున్నారు. కొత్తగా వేసే రైల్వే లైన్లను అసలు లెవల్ క్రాసింగ్ లే లేకుండా నిర్మించబోతున్నారు.

Advertisement
Update:2023-09-14 07:30 IST

రైల్వే లెవల్ క్రాసింగ్ ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. గేట్లు, కాపలా ఉన్నా కూడా కొంతమంది ఆవేశపడి రైలు వస్తున్నా ట్రాక్ ని దాటేయాలనుకుంటారు. ఇక కాపలా లేని లెవల్ క్రాసింగ్ ల సంగతి సరేసరి. ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. కొత్తగా వేసే రైల్వే లైన్లలో అసలు క్రాసింగ్ లే లేకుండా ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో వేస్తున్న కొత్త లైన్లలో ఈ పద్ధతి అమలు చేస్తోంది.

కొత్తగా వేసే జాతీయ రహదారుల్లో లెవల్ క్రాసింగ్ లు దాదాపుగా కనిపించవు. గ్రామాలు, గ్రామాల సమీపంలో హైవే వెళ్లినా కూడా అండర్ పాస్ లు, ఓవర్ బ్రిడ్జ్ లు నిర్మిస్తున్నారు. హైవే నిర్మాణంతో కలిపి వీటిని కూడా నిర్మిస్తున్నారు. ఇదే విధానాన్ని రైల్వే నూతన లైన్లలో కూడా అమలు చేయాలనుకుంటున్నారు అధికారులు. కొత్తగా వేసే రైల్వే లైన్లకు అసలు లెవల్ క్రాసింగ్ లే లేకుండా నిర్మించబోతున్నారు. ట్రాక్ నిర్మాణ సమయంలోనే ఆయా గ్రామాల వద్ద ఓవర్ బ్రిడ్జ్ లు లేదా అండర్ బ్రిడ్జ్ లు నిర్మిస్తారు.

ప్రస్తుతం తెలంగాణలో మనోహరాబాద్‌–కొత్తపల్లి నూతన రైల్వే లైన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. మేడ్చల్‌ సమీపంలోని మనోహరాబాద్‌ స్టేషన్‌ నుంచి గజ్వేల్, సిద్దిపేట మీదుగా కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి వరకు ఈ లైన్ వెళ్తుంది. సిద్దిపేట వరకు పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులో కీలక ప్రాంతాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్(ROB)లు, రైల్వే అండర్ బ్రిడ్జ్(RUB)లు ప్లాన్ చేశారు. ఇంకా నాలుగు లెవల్ క్రాసింగ్ లు ఉన్నాయి. వీటిని కూడా పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. కొడకండ్ల శివారులో కొత్తగా లిమిటెడ్ RUB ఏర్పాటుకి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కొమురవెల్లి రెండో కమాన్ రోడ్డు వద్ద ఉన్న లెవల్ క్రాసింగ్ కూడా తొలగించి అరకిలోమీటర్ పొడవుతో ROB వేయాలని నిర్ణయించారు. అంటే ఈ కొత్తలైన్ లో ఎక్కడా లెవల్ క్రాసింగ్ లు ఉండవన్నమాట. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పాత లైన్ల మీద 1,150 వరకు లెవల్‌ క్రాసింగ్స్‌ ఉన్నాయి. వీటిలో అన్ని చోట్లా కాపలా ఉంది. వీటిని కూడా దశల వారీగా తొలగించాలని భావిస్తున్నారు అధికారులు. 

Tags:    
Advertisement

Similar News