విభజన చట్టం హామీ: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ
తెలంగాణకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విభజన హామీలలో మరో హామీని కేంద్రం నెరవేర్చింది. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం అక్కడ ఉన్న ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అప్‌గ్రేడ్ చేయాలని గత ఏడాది జులై 5న సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్‌గ్రేడ్ చేసిన యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారుచేయడానికి అనుగుణంగా యూనిట్‌ను అభివృద్ధి చేయాలని ఈ ఏడాది సెప్టెంబర్ 9న రైల్వే బోర్డు ఆదేశాలిచ్చింది. కాజిపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని రైల్వే బోర్డు సూచించింది. విభజన హామీల అమలుపై తెలంగాణ అధికారులు, కేంద్ర అధికారులతో హోం శాఖ నిర్వహించిన భేటీలో ఈ విషయం వెల్లడైంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. విభజన హామీ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం కుదరని చెప్పింది. విభజన హామీల అమలులో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. ఎనిమిది ఎంపీలను అందించిన కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందని నిలదీసింది. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారు? విభజన హామీలను నెరవేర్చడంలో ఏ మేరకు కృషి చేశారని చాలాసార్లు విమర్శించింది. ఈ నేపథ్యంలోనే విభజన హామీ మేరకు కాజీపేటలో రైల్వే కోచ్ ఏర్పాటు చేయడానికి కేంద్రం అంగీకరించడం గమనార్హం.