రాహుల్ పర్యటనలో మార్పు.. నేడు కీలక నేతల చేరిక
ఆర్మూర్ బహిరంగ సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పాటిల్.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారు.
తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన మూడో రోజుకి చేరుకుంది. ఈరోజు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మల్యాలలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దు చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం నిజామాబాద్ లో జరగాల్సిన పాదయాత్ర కూడా క్యాన్సిల్ అయింది. ఆర్మూరులో పసుపు, చెరుకు రైతులతో రాహుల్ ముఖాముఖి మాత్రం యధావిధిగా జరుగుతుంది.
ఆర్మూరులో బహిరంగ సభ..
కరీంనగర్ నుంచి జగిత్యాలకి రాహుల్ గాంధీ నేరుగా వెళ్తారు. ఆ తర్వాత అక్కడే కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. కోరుట్లలో కార్నర్ మీటింగ్ లో పార్టీ శ్రేణులతో మాట్లాడతారు. అక్కడే మధ్యాహ్న భోజనం ముగించుకుని ఆర్మూర్ వెళ్తారు. ఆర్మూరులో రైతులతో రాహుల్ ముఖాముఖి అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. సభ అనంతరం హెలికాప్టర్ లో హైదరాబాద్ కి వచ్చి అక్కడనుంచి ఫ్లైట్ లో ఢిల్లీకి బయలుదేరతారు. త్వరగా ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో షెడ్యూల్ కుదించినట్టు తెలిపారు కాంగ్రెస్ నేతలు.
చేరికలు..
ఆర్మూర్ బహిరంగ సభలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ముధోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణ రావు పాటిల్.. రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరతారు. ఈ చేరికల సందర్భంగా ఆర్మూర్ మీటింగ్ కి భారీ ఏర్పాట్లు చేశారు. పెద్ద ఎత్తున జనసమీకరణకు స్థానిక నేతలు కష్టపడుతున్నారు.