రాహుల్ పరుగో పరుగు.. జోడో యాత్రలో ఆసక్తికర సన్నివేశం
రాహుల్ వేగాన్ని ఇతరులు ఎవ్వరూ అందుకోలేకపోయారు. మిగిలిన వాళ్లు వెనకబడ్డారని తెలుసుకొని ఆయన ఆ తర్వాత ఆగిపోయారు.
తెలంగాణలో భారత్ జోడో యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఆదివారం జడ్చర్ల క్రాస్ రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్రలో కాంగ్రెస్ నాయకలు, కార్యకర్తలతో పాటు వేలాది మంది ప్రజలు తోడయ్యారు. ఆదివారం కావడంతో పిల్లలు కూడా రాహల్ గాంధీని చూడటానికి వేకువజామునే యాత్ర ప్రారంభమయ్యే ప్రదేశానికి చేరుకున్నారు. యాత్ర ప్రారంభమైన కాసేపటికి పిల్లతో కలసి రాహుల్ పరుగు లంకించుకున్నారు. రాహుల్ వెనుక పిల్లతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు కూడా పరుగు పెట్టారు.
రాహుల్ వేగాన్ని ఇతరులు ఎవ్వరూ అందుకోలేకపోయారు. మిగిలిన వాళ్లు వెనకబడ్డారని తెలుసుకొని ఆయన ఆ తర్వాత ఆగిపోయారు. ఐదు పదులు దాటిన వయసులో కూడా రాహుల్‌కు ఉన్న ఫిట్‌నెస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. రాహుల్ అకస్మాతుగా పరుగు పెట్టడంతో సెక్యూరిటీ వాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. కాగా రాహుల్ యాత్ర ఎల్లుండి ఉదయానికి హైదరాబాద్ శివారుకు చేరుకోనున్నది. నవంబర్ 1న శంషాబాద్ నుంచి ఆయన యాత్రను ప్రారంభిస్తారు.
రాహుల్ భారత్ జోడో యాత్ర తొలి సారిగా ఓ మెట్రో సిటీ గుండా సాగనున్నది. రెండు రోజుల పాటు ఆయన హైదరాబాద్‌లోని ముఖ్య కూడళ్ల మీదుగా నకడ సాగించనున్నారు. ప్రజలందరూ ఆయన రాకకోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు శంషాబాద్‌లో ఏర్పాటు చేసే సభ ద్వారా మునుగోడు ఉపఎన్నికలో లబ్ది పొందాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.