రాహుల్ గాంధీ రంగుల కల చూపించి నిండా ముంచిండు
ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిండు : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు ఆటో ఎక్కి డ్రైవర్ల సమస్యలు తీరుస్తానని చెప్పి రంగుల కల చూపించి నిండా ముంచాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించాయన్నారు. మంగళవారం ఇందిరాపార్క్ లో ఆటో డ్రైవర్ల మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ పాలనలో రోజుకు రూ.2 వేల వరకు సంపాదించుకున్న ఆటో డ్రైవర్లు ఇప్పుడు రూ.200, రూ.300 కూడా సంపాదించలేని దుస్థితికి చేరుకున్నారని అన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటోడ్రైవర్లు దయనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో ఆటోడ్రైవర్ కు నెలకు రూ.వెయ్యి, ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను వ్యతిరేకించడం లేదన్నారు. మహాలక్ష్మీ పేరుతో మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తానని హామీ ఇచ్చారని వెంటనే ఆ స్కీం అమలు చేయాలని కోరారు. రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ఆటోడ్రైవర్ల పేర్లతో సహా అసెంబ్లీలో చెప్పామని.. వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి తాము వ్యతిరేకం కాదని.. ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న నెలకు రూ.వెయ్యితో పాటు రూ.5 వేలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆటోడ్రైవర్ల సంక్షేమ బోర్డు ప్రకటించాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కల్పించాలని, ఆటోడ్రైవర్లను ఇబ్బందులకు గురి చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చెప్పిన తియ్యని, కమ్మని మాటలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆటోడ్రైవర్లు మహాధర్నాకు రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని అన్నారు. పోలీసులు డ్యూటీలు చేయాలి కాని పేదల పట్ల దయతో ఉండాలని సూచించారు. సెక్యూరిటీ లేకుండా బయటకు వెళితే రేవంత్ రెడ్డిని తన్నే పరిస్థితి నెలకొందని, అందుకే బయటకు రావడం లేదన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్న సభలో ''మనం బయటకు వెళితే తన్నే పరిస్థితి ఉంది'' అని ఒక నాయకుడు చెప్పారని గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అందరూ కోపంతో ఉన్నారని ఆ నాయకుడు అన్నారని వివరించారు. రేవంత్ రెడ్డికి పోలీసులపైనా నమ్మకం లేకనే సెక్యూరిటీలో నుంచి బెటాలియన్ పోలీసులను తీసేశారని అన్నారు. మార్పు.. మార్పు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ అందరి కొంపలు ముంచిందన్నారు. నిరుద్యోగులు, రైతులు, వృద్ధులు, మహిళలు ఇలా అందరినీ కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా ప్రజల కోసం పోరాడతామన్నారు. ఆటో డ్రైవర్లతో పాటు అన్నివర్గాల ప్రజల పక్షాన తాము పోరాడుతామన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా భయకుండా పోరాడేవాళ్ల సమస్యలకు మద్దతునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆందోళనలో బీఆర్‌ఎస్ నాయకులు, ఆటోయూనియన్‌ల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్యారడైజ్ హోటల్ కు కేటీఆర్
ఇందిరాపార్క్ లో ఆటోడ్రైవర్ల మహాధర్నాలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి సికింద్రాబాద్ పారడైజ్ హోటల్ కు వెళ్లారు. ఈ సందర్భంగా హోటల్ సిబ్బంది, అక్కడ ఉన్న ప్రజలతో ఆయన ఫొటోలు దిగారు. అనంతరం నాయకులతో కలిసి బిర్యానీ తిన్నారు. అంతకుముందు నందినగర్ లోని నివాసం నుంచి ఇందిరాపార్క్ కు ఆటోలో చేరుకున్నారు.