రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ.. పొత్తుపై కీలక నిర్ణయం
కేసీఆర్ వైరి వర్గాన్నంతా ఓ దగ్గరకు చేర్చాలనేది కాంగ్రెస్ వ్యూహం. ఆ వ్యూహం ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి.
కాంగ్రెస్ పార్టీతో కలసి వెళ్లాలని తెలంగాణ జన సమితి నిర్ణయించింది. ఈ మేరకు రాహుల్ గాంధీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మధ్య కీలక భేటీ జరిగింది. దాదాపుగా పొత్తు ఖరారైనట్టే. అయితే సీట్ల విషయంలో మరో దఫా చర్చలు జరిపి అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. రెండు మూడు చోట్ల కాంగ్రెస్ సపోర్ట్ తో తెలంగాణ జన సమితి అభ్యర్థుల్ని నిలబెడతారని అంటున్నారు. అయితే కోదండరాం మాత్రం ఈ ఎన్నికల్లో పోటీ చేయరని సమాచారం.
తెలంగాణలో మూడో రోజు కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలయ్యే ముందు కరీంనగర్ లో రాహుల్ గాంధీతో కోదండరాం భేటీ అయ్యారు. కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని కోదండరాంను రాహుల్ కోరినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పై ఉమ్మడి పోరుకు తాము కాంగ్రెస్ తో కలసి పనిచేస్తామని చెప్పారు కోదండరాం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా..
తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. అందుకే వైఎస్సార్టీపీతో కూడా చర్చలు జరిగాయి కానీ, ఆఫర్ నచ్చక షర్మిల ఒంటరి పోరుకి దిగుతున్నారు. వామపక్షాలతో కాంగ్రెస్ డీల్ సెట్ అయింది. ఇప్పుడు తెలంగాణ జన సమితిని కూడా ఉమ్మడి పోరాటానికి సై అంటోంది. కేసీఆర్ వైరి వర్గాన్నంతా ఓ దగ్గరకు చేర్చాలనేది కాంగ్రెస్ వ్యూహం. ఆ వ్యూహం ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో వేచి చూడాలి.