తెలంగాణలో రాహుల్ యాత్ర... స్వాగతం పలికిన వేలాదిగా ప్రజలు
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు తెలంగాణలోకి అడుగుపెట్టింది. తెలంగాణలో మూడు కిలోమీటర్ల మేర యాత్ర సాగిన అనంతరం గూడబల్లూరు వద్ద జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ రోజు ఉదయం తెలంగాణలో అడుగుపెట్టింది. కర్ణాటక నుండి నారాయణ పేట జిల్లా గూడబల్లేరు వద్ద ఈ యాత్ర తెలంగాణలోకి ఎంటరయ్యింది. ఈ సందర్భంగా కృష్ణా నది బ్రిడ్డి జన సంద్రమైంది.
తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రశ్రేణులు, నేతలు, కార్యకర్తలు, వేలాదిగా ప్రజలు స్వాగతం పలికారు.
మూడు కిలోమీటర్ల మేర యాత్ర సాగిన అనంతరం గూడబల్లూరు వద్ద జరిగిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ...ఆరెస్సెస్, బీజేపీ లు దేశాన్ని విచ్చిన్నం చేస్తున్నాయని, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చ గొట్టి విభజనరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వారి కుటిల ప్రణాళికను అడ్డుకొని దేశాన్ని సమైక్యంగా ఉంచడం కోసమే భారత్ జోడో యాత్ర చేపట్టానన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు రాహుల్ గాంధీ అన్నారు. ఈ యాత్రను ఏ శక్తీ అడ్డుకోలేదని రాహుల్ స్పష్టం చేశారు.
కాగా దీపావళి సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 27 వరకు రాహుల్ యాత్రకు విరామం ఇవ్వనున్నారు. ఈ సమయంలో ఆయన ఢిల్లీ వెళ్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే ప్రమాణాస్వీకారోత్సవంలో 26వ తేదీన ఆయన పాల్గొంటారు. 27 నుంచి మళ్ళీ తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమవుతుంది. 12 రోజుల పాటు రాష్ట్రంలో ఈ యాత్ర సాగుతుంది. నవంబర్ 7వ తేదీన కామా రెడ్డి జిల్లా శాఖాపూర్ గ్రామం వద్ద తెలంగాణలో యాత్ర పూర్తి చేసుకొని మహారాష్ట్రలో అడుగుపెడుతారు రాహుల్.