బంగారం పేరుతో వ్యాపారులకు టోకరా.. - ముఠాను పట్టేసిన పోలీసులు

బోడుప్పల్‌కి చెందిన వ్యాపారి దిలీప్‌ బర్ఫా తన మిత్రుడు సింగిరెడ్డి సురేష్‌తో కలిసి మే 19న బెంగళూరులో విజయ్‌ని, సునీల్‌ని కలిశాడు. బర్ఫాను నమ్మించేందుకు వారు 101 గ్రాముల అసలు బంగారాన్ని రూ.6 లక్షలకే విక్రయించారు.

Advertisement
Update:2024-06-19 10:56 IST

నకిలీ బంగారంతో వ్యాపారులను మోసం చేస్తున్న ఘరానా ముఠా గుట్టు రట్టయింది. ముఠాలోని నలుగురు నిందితులను మేడిపల్లి పోలీసులు తాజాగా అరెస్ట్‌ చేశారు. రాచకొండ సీపీ తరుణ్‌ జోషి కేసు వివరాలను విలేకరులకు మంగళవారం వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలి కంచరమెట్టకు చెందిన కర్రెద్దుల విజయ్ కుమార్ అలియాస్‌ కృష్ణమోహన్‌ (39) బీటెక్‌ పూర్తిచేశాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను.. బీటెక్‌ పూర్తయిన నాటినుంచే ఈజీగా డబ్బు సంపాదించేందుకు మార్గాలను అన్వేషించాడు.

సమీప గ్రామంలో నకిలీ బంగారం పేరుతో మోసం చేసే వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. ఇదే క్రమంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన నంబూరి డేవిడ్‌ లివింగ్‌ స్టోన్‌ అలియాస్‌ సెంథిల్‌ (52), నెల్లూరు జిల్లా కావలికి చెందిన బోగిరి సునీల్‌ గవాస్కర్‌ అలియాస్‌ హరీశ్‌ (26), అడిగోపుల ఓం సాయి కిరీటి (26)లు విజయ్ కుమార్‌కి పరిచయమయ్యారు. ఈ నలుగురూ బెంగళూరు కేంద్రంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోసాలకు పాల్పడుతున్నారు. 2010 నుంచి మోసాలు చేస్తున్న ప్రధాన నిందితుడు విజయ్‌పై 13 కేసులు ఉండటం గమనార్హం. నాలుగు కేసుల్లో అతను పరారీలో ఉన్నాడు. డేవిడ్‌ మీద రెండు కేసులు ఉన్నాయి.

బోడుప్పల్‌కి చెందిన వ్యాపారి దిలీప్‌ బర్ఫా తన మిత్రుడు సింగిరెడ్డి సురేష్‌తో కలిసి మే 19న బెంగళూరులో విజయ్‌ని, సునీల్‌ని కలిశాడు. బర్ఫాను నమ్మించేందుకు వారు 101 గ్రాముల అసలు బంగారాన్ని రూ.6 లక్షలకే విక్రయించారు. దీంతో బర్ఫాకు నమ్మకం కలిగి రెండు కిలోల బంగారం కావాలని చెప్పగా రూ.1.1 కోట్లకు ఇస్తామని నిందితులు చెప్పారు. బర్ఫా రూ.20 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చాడు. మే 29న బర్ఫా, సురేష్‌ ఇద్దరూ మరోమారు బెంగళూరుకు వెళ్లారు. వారి కళ్లముందే విజయ్‌ 5 కిలోల బంగారం అమ్మి.. కోట్ల రూపాయల్లో డబ్బు తీసుకుంటున్నట్టు నటించాడు. తర్వాత బర్ఫా రూ.90 లక్షలు ఇవ్వగా.. నిందితులు అతనికి నకిలీ బంగారం ఇచ్చారు.

నిందితులు ఇచ్చిన నకిలీ బంగారం నిజమైనదిగా భావించి తిరిగి వస్తున్న బర్ఫా, సురేష్‌లను సాయి కిరీటి నకిలీ పోలీసులా వచ్చి తనిఖీల పేరుతో బంగారం స్వాధీనం చేసుకుని వెళ్లిపోయాడు. ఈ క్రమంలో బాధితుడు మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిందితుల కదలికలపై నిఘా ఉంచిన మేడిపల్లి ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి, ఎస్సై నర్సింగరావు కీసరలో నలుగురినీ ఒకేసారి అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6.86 కోట్ల నకిలీ నోట్లు, 5 కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు, రూ.51 లక్షల నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    
Advertisement

Similar News