తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు.. సరిహద్దుల వద్ద పోలీసుల నిఘా

దేశంలోనే యాసంగి ధాన్యానికి గరిష్ట మద్దతు ధర తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇక్కడికి అక్రమంగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Update:2023-04-19 06:34 IST

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయించింది. కాగా, తెలంగాణలో పంట కొనుగోలు చేస్తుంన్నందున రాష్ట్ర సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీ అంజనీకుమార్ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ ధాన్యం ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లై అధికారులు, ఎక్సైజ్ అధికారులకు సూచించారు.

దేశంలోనే యాసంగి ధాన్యానికి గరిష్ట మద్దతు ధర తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఇక్కడికి అక్రమంగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘడ్‌లకు చెందిన 17 జిల్లాల నుంచి రైతులు/వ్యాపారులు ఇక్కడకు ధాన్యం తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ఆయా జిల్లాల సరిహద్దుల వద్ద 50 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని డీజీపీ అంజనీకుమార్ చెప్పారు.

2014-15 సీజన్‌తో పోలిస్తే.. ఇప్పుడు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఆరింతలు పెరిగినట్లు డీజీపీ చెప్పారు. ప్రస్తుతం 161 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తోందని వెల్లడించారు. అలాగే సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసే సామర్థ్యం లేనందున మిల్లర్లు అక్రమ మార్గాల ద్వారా తరలించే అవకాశం కూడా ఉన్నది. అందుకే మిల్లుల్లోని ధాన్యం స్టాక్‌లపై కూడా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని డీజీపీ పోలీసు, సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. గతంలో ఇలాంటి అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల నుంచి మాత్రమే కాకుండా.. ఇతర మార్గాల గుండా అక్రమ ధాన్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి మార్గాలను కూడా గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ అన్నారు. రేషన్ బియ్యాన్ని కొందరు మిల్లర్లు రూ.9కి కొని.. వాటినే తిరిగి రూ.35కు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు

Tags:    
Advertisement

Similar News