కేసీఆర్, కేజ్రీవాల్ తో దేశంలో రైతు రాజ్యం..

తెలంగాణలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాల వల్ల నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు కుల్తార్ సింగ్. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలు అమలులోకి రావాలంటే అందరూ కేసీఆర్ కి మద్దతివ్వాలని కోరారు.

Advertisement
Update:2022-12-25 10:44 IST

ఇటీవల పంజాబ్ సీఎం భగవంత్ మన్ తెలంగాణ పర్యటన తర్వాత, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సహా డిప్యూటీ స్పీకర్, మరికొంతమంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు తెలంగాణలో పర్యటించారు. నిజామాబాద్ లో వారు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలతో వారు సమావేశమయ్యారు. దేశంలో రైతు రాజ్యం రావాలని, అది కేసీఆర్, కేజ్రీవాల్ తోనే సాధ్యమని అన్నారు పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్.

తెలంగాణలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కార్యక్రమాల వల్ల నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతోందన్నారు కుల్తార్ సింగ్. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలు అమలులోకి రావాలంటే అందరూ కేసీఆర్ కి మద్దతివ్వాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ బాగా అభివృద్ధి చెందాయని అన్నారాయన.

కేసీఆర్, కేజ్రీవాల్ ఆదర్శ పాలన..

ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అన్నీ ఉచితంగా ఇస్తోందని, చదువు, వైద్యం పేదలకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు కుల్తార్ సింగ్. పంజాబ్ లో ఉచిత కరెంట్ ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపంలో వచ్చిన డబ్బుల్ని రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు పెడితే రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. రైతులు అభివృద్ధి చెందితేనే దేశం బాగుపడుతుందన్నారు. రైతుబందు పథకంతో రైతులకు మేలు జరుగుతుందని, రైతుకు మంచి చేస్తేనే దేశానికి మంచి జరుగుతుందన్నారు కుల్తార్ సింగ్. రైతుల బిడ్డలే సైనికులుగా మారారని, కేసీఆర్, కేజ్రీవాల్ ఆదర్శ పాలన అందిస్తున్నారని చెప్పారు.

బీఆర్ఎస్ కి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు లభిస్తుండటంతో బీజేపీలో కంగారు పుడుతోంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. ఉత్తరాదిన బీజేపీని ఆమ్ ఆద్మీ గడగడలాడిస్తోంది. ఇటు దక్షిణాదిన బీఆర్ఎస్ మంటపెడుతోంది. ఈ రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణతో బీజేపీకి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు.

Tags:    
Advertisement

Similar News