పబ్లిసిటీ ఫుల్ - రిజల్ట్ నిల్.. రుణమాఫీపై కేటీఆర్
కేసీఆర్ మొదటి విడతలో రూ.లక్షలోపు మాఫీ చేస్తేనే రూ.16 వేల కోట్లు ఖర్చయిదని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసినప్పటికీ..రూ.12 వేల కోట్లే ఎందుకు ఖర్చయ్యాయన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ.2లక్షలలోపు రుణమాఫీ ప్రక్రియను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మొదటి విడతలో రూ.లక్ష రూపాయలు మాఫీ చేసినట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, రెండు రోజుల క్రితం రూ.లక్షా 50 వేలలోపు రుణాలకు సంబంధించిన మొత్తం నగదును బ్యాంకులకు బదిలీ చేసినట్లు స్పష్టం చేసింది. కాగా, రుణమాఫీ లబ్ధిదారుల జాబితాలో చాలా మంది రైతుల పేర్లు గల్లంతయ్యాయి. దీంతో గందరగోళం నెలకొంది.
ఇదే అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. రైతులను మోసం చేయడం ఆపాలన్నారు కేటీఆర్. కేసీఆర్ మొదటి విడతలో రూ.లక్షలోపు మాఫీ చేస్తేనే రూ.16 వేల కోట్లు ఖర్చయిదని.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు రుణమాఫీ చేసినప్పటికీ..రూ.12 వేల కోట్లే ఎందుకు ఖర్చయ్యాయన్నారు. రైతు రుణమాఫీలో ఆంక్షలు పెడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఈ విషయం రైతులకు కూడా తెలుసన్నారు. రేషన్ కార్డు, ఫ్యామిలీ పేరిట ఆంక్షలు పెట్టడంతో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు కేటీఆర్.
మొదట్లో రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు ఖర్చవుతుందన్నారని గుర్తుచేశారు కేటీఆర్. తర్వాత రూ.30 వేల కోట్లని చెప్పి బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.25 వేల కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. చారణ కోడికి బారాణ మసాలా అన్నట్లుగా రెండు, మూడు సార్లు పత్రికలకు ప్రకటనలు ఇస్తున్నారన్నారు. కేంద్రంపై పోరాడే ప్రభుత్వ పెద్దలు.. రుణమాఫీకి పీఎం కిసాన్ నిబంధనలు అప్లై చేయడం అన్యాయమన్నారు కేటీఆర్.