ప్రజాపాలన ప్రజా పీడనగా మారింది
ప్రజావాణి ఉత్త ప్రహసనమేనని తేలిపోయింది : మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రజాపాలన ప్రజా పీడనగా మారిందని.. ప్రజావాణి కార్యక్రమం ఉత్త ప్రహసనమేనని తేలిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ప్రజావాణిపై తాను ఆర్టీఐ ద్వారా చేసి దరఖాస్తుతోనే అది ఉత్త డొల్ల అని స్పష్టమైందన్నారు. సీఎం క్యాంపు ఆఫీస్‌లో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో డబ్బా కొట్టారని, సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరోజు 10 నిమిషాలు మాత్రమే ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి తర్వాత పత్తా లేరని తెలిపారు. దీంతోనే ఆ కార్యక్రమంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి తేలిపోయిందన్నారు. సీఎం, మంత్రులు ప్రజావాణికి రాకపోగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారని అన్నారు. 2024 డిసెంబర్ 9వ తేదీ నాటికి ప్రజావాణి కార్యక్రమానికి 82,955 పిటిషన్లు వచ్చాయని తన ఆర్‌టీఐ దరఖాస్తుకు సమాధానంగా అధికారులు తెలిపారని, వాటిలో 43,272 మాత్రమే గ్రీవెన్సెస్‌గా పరిగణించి మిగతా వాటిని రిజెక్ట్ చేశారని తెలిపారు. సిటిజన్ చార్టర్ ప్రకారం అందాల్సిన సదుపాయాలు అందకపోవడమే గ్రీవెన్సెస్‌గా పరిగణిస్తామంటే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని ప్రశ్నించారు. ప్రభుత్వం గ్రీవెన్సెస్ గా గుర్తించి 43,272లో 27,215 పరిష్కరించామని అధికారులు చెప్తోన్నా అందులో నిజం లేదన్నారు. అనేక సమస్యలను పరిష్కరించకుండానే ఫైళ్లు క్లియర్ చేశారని క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా తేలుతుందన్నారు. ప్రజలు ఎన్నో కష్టాలు పడి హైదరాబాద్ వరకు వచ్చి సమస్య చెప్పుకుంటే ప్రభుత్వం వాటిని పరిష్కరించడం లేదన్నారు.