రుణమాఫీపై నిరసన తెలిపిన రైతులు అరెస్ట్

మొత్తం 11మంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పేరుతో వారిని స్టేషన్ కు తరలించారు.

Advertisement
Update:2024-08-19 09:27 IST

రుణమాఫీ కాని వారికి స్పెషల్ డ్రైవ్ పెట్టి వారి కష్టాలు తీరుస్తామని ఓవైపు ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరోవైపు దానికి పూర్తి విరుద్ధంగా నిరసన చేపట్టిన అన్నదాతలకు సంకెళ్లు వేస్తోంది. ఇదెక్కడి న్యాయం అని ప్రతిపక్షం ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్టు ఉంది. రైతు సంకెళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత పెద్ద తప్పు చేసినట్టయిందని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.


కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ సాయం తమకు అందలేదని, వివిధ కారణాలతో కొర్రీలు వేసి తమని అనర్హులుగా పక్కనపెట్టారంటూ అదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో కొంతమంది రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సీఎం దిష్టిబొమ్మతో శవ యాత్ర చేశారు. తమ నిరసనను కాస్త ఘాటుగానే వారు వ్యక్తపరిచారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. స్థానిక నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి రైతుల్ని అరెస్ట్ చేయించారని అంటున్నారు.

మొత్తం 11మంది రైతుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ పేరుతో వారిని స్టేషన్ కు తరలించారు. రైతుల అరెస్ట్ తో తలమడుగు మండల వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అంటున్న కాంగ్రెస్ నేతలు, ప్రజలకు నిరసన తెలిపే హక్కు కూడా ఇవ్వరా అని ప్రశ్నిస్తున్నారు. ధర్నా చౌక్ ని తిరిగి వినియోగంలోకి తెచ్చామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్ నేతలు.. నిరసన తెలిపిన రైతుల్ని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమేనా అని నిలదీస్తున్నారు. ఈ అరెస్ట్ లపై కాంగ్రెస్ నేతలు స్పందించాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News