గవర్నర్ తమిళిసై ఆమోదానికి నోచుకోని ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు.. విద్యార్థులు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

తెలంగాణ అసెంబ్లీలో గతేడాది సెప్టెంబర్ 5న ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును పాస్ చేసి.. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై వద్దకు పంపారు.

Advertisement
Update:2023-07-02 07:54 IST

తెలంగాణలోని ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరిన దాదాపు 3వేల మంది విద్యార్థుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చూపింది. గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లో చేరిన విద్యార్థులను వారి అంగీకారం మేరకు రాష్ట్రంలోని ఇతర కాలేజీల్లో సర్థుబాటు చేయనున్నది. ఈ మేరకు శనివారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి అరుణ, రాష్ట్ర ఉన్నత మండలి చైర్మన్ ఆర్. లింబాద్రి చర్చించారు.

తెలంగాణ అసెంబ్లీలో గతేడాది సెప్టెంబర్ 5న ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లును పాస్ చేసి.. ఆమోదం కోసం గవర్నర్ తమిళిసై వద్దకు పంపారు. అయితే గవర్నర్ తమిళిసై ఆ బిల్లును ఆమోదించకుండా.. మరిన్ని వివరాలు కావాలంటూ తిప్పి పంపారు. గవర్నర్ అడిగిన సమాచారాన్ని జోడించి.. రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రాజ్ భవన్‌కు బిల్లును పంపింది. అయినా సరే ఇప్పటి వరకు గవర్నర్ సదరు బిల్లుకు ఎలాంటి ఆమోదం తెలపలేదు.

రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు పాసైందనే ధీమాతో శ్రీనిధి, గురునానక్ యూనివర్సిటీలు విద్యార్థులను ముందస్తుగానే చేర్చుకున్నాయి. గవర్నర్ చేస్తున్న జాప్యంతో ఆయా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థుల భవిష్యత్ గందరగోళంలో పడింది. ఏదో ఒక పరిష్కారం చూపకపోతే విద్యార్థులు నష్టపోతారని భావించిన తెలంగాణ ప్రభుత్వం.. వారిని ఇతర కాలేజీల్లో సర్థుబాటు చేయడానికి నిర్ణయించింది.

ప్రభుత్వం అనుమతి, విశ్వవిద్యాలయాల గుర్తింపు లేకుండా కొన్ని యూనివర్సిటీలు గతంలో విద్యార్థులను చేర్చుకున్నాయి. అలాంటి సందర్భాల్లో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఏదైనా కళాశాలలో చేర్పించి పరీక్షలు రాయించాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీని ఆధారంగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో చేరిన ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు ఇతర కళాశాలల్లో చేరవచ్చని అధికారులు సూచించారు.

గురునానక్‌లో 2,500 మంది.. శ్రీనిధిలో 300 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. వారిని ఇతర కళాశాలల్లో.. సూపర్ న్యూమరరీ కోటా కింద చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఏ ఒక్క విద్యార్థి నష్టపోకూడదనే ఈ చర్యలు తీసుకున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం కానున్నాయి.

Tags:    
Advertisement

Similar News