గవర్నర్ తమిళిసై వద్దకు మరోసారి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు!

గవర్నర్ తమిళిసై వివరణ కోరిన వాటిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టానికి సంబంధించిన బిల్లు ఉన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన వివరణ ఇచ్చి తిరిగి రాజ్‌భవన్‌కు ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయం పంపింది.

Advertisement
Update:2023-06-11 07:51 IST

గవర్నర్ తమిళిసై వద్దకు మరోసారి ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు చేరింది. గతంలోనే అసెంబ్లీ, శాసన మండలి ఏకగ్రీవంగా ప్రైవేట్ వర్సిటీల బిల్లు పాస్ చేసి.. ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపారు. కాగా, గవర్నర్ చాలా కాలం బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. దాదాపు 10 బిల్లులను తన వద్దే పెట్టుకున్న గవర్నర్ తమిళిసై.. ఆ తర్వాత 3 బిల్లులను ఆమోదించారు. రెండింటిని రాష్ట్రపతి వద్దకు పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం పంపారు. మిగిలిన మూడింటిలో ఒక బిల్లును తిరస్కరించి.. మరో రెండు బిల్లులపై మాత్రం వివరణ కోరారు.

గవర్నర్ తమిళిసై వివరణ కోరిన వాటిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టానికి సంబంధించిన బిల్లు ఉన్నది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన వివరణ ఇచ్చి తిరిగి రాజ్‌భవన్‌కు ఆమోదం కోసం ముఖ్యమంత్రి కార్యాలయం పంపింది. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో కావేరీ వ్యవసాయ విశ్వవిద్యాలయం, గురునానక్ యూనివర్సిటీ, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఇక్మార్), శ్రీనిధి యూనివర్సిటీల ఏర్పాటుపై గతేడాది సెప్టెంబర్‌లో శాసన సభ, శాసన మండలి ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసింది.

ఇరు సభల్లో పాసైన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపారు. కాగా, శాసన సభలో బిల్లు పాస్ కావడంతో గవర్నర్ ఆమోదం లభిస్తుందనే అంచనాలతో గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీలు విద్యార్థులను కూడా చేర్చుకున్నాయి. అయితే, గవర్నర్ ఆమోదించకుండా.. వివరణ కోరుతూ తిరిగి ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఆయా యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుపై వివరణ ఇస్తూ గవర్నర్ వద్దకు పంపారు.

కాగా,ఈ సారి గవర్నర్ తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుందని.. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లను పెండింగ్ పెట్టే అవకాశం ఉండబోదని అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News