ప్రధాని మోడీ సభలు.. అభ్యర్థుల ప్రకటన.. దూకుడు పెంచనున్న బీజేపీ

మోడీ సభలు ముగిసన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు ఇతర అగ్రనేతల సభలు ఉంటాయని రాష్ట్ర బీజేపీ నాయకులు తెలిపారు.

Advertisement
Update: 2023-09-23 02:03 GMT

తెలంగాణ ఎన్నికల కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సిద్ధపడుతున్నాయి. ప్రభుత్వం తరపున పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మరింత నమ్మకం పెంచుకునే పనిలో ఉన్నది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించి ప్రజల్లోకి తమ వాగ్దానాలను తీసుకెళ్తోంది. ఇక నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం అని చెప్పుకున్న బీజేపీ మాత్రం సైలెంట్‌గా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి బీజేపీ శ్రేణులు డీలా పడ్డాయి.

తెలంగాణ ఎన్నికలకు సంబంధించి ఆశావాహుల నుంచి ఒక వారం పాటు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంతో కాస్త హడావిడి కనిపించింది. ఆ తర్వాత ఆ దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన ఏమయ్యిందో ఇంత వరకు ఎవరూ చెప్పడం లేదు. అయితే అక్టోబర్ మొదటి వారంలో ప్రధాని మోడీ సభలు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి దూకుడు పెంచాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగానే అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభలు ప్లాన్ చేసింది. ఆ రోజు మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లో ప్రధాని బహిరంగ సభల్లో పాల్గొంటారని బీజేపీ తెలిపింది.

మోడీ సభలు ముగిసన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పాటు ఇతర అగ్రనేతల సభలు ఉంటాయని రాష్ట్ర బీజేపీ నాయకులు తెలిపారు. లోక్‌సభ సమావేశాలు ముగియడంతో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే తెలంగాణలో బహిరంగ సభలతో పాటు అభ్యర్థులను కూడా ప్రకటించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రధాని సభలను కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలుగా కాకుండా.. రాజకీయ సభలుగా నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయం తీసుకున్నది. ప్రధాని మోడీ సభల ద్వారా తెలంగాణ ఎన్నికల శంఖారావం పూరించాలని బీజేపీ భావిస్తోంది.

రాష్ట్ర బీజేపీ నిర్వహించ తలపెట్టిన బస్సు యాత్రను రద్దు చేసి.. వాటి స్థానంలో నియోజకవర్గాల స్థాయిలో రెండు, మూడు సభలను ప్లాన్ చేయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఈ నియోజకవర్గాల స్థాయి సభలు ప్రారంభం కానున్నాయి. పార్టీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఆయా సభల్లో పాల్గొనేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల సభలు ప్రారంభించడానికి ముందే అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించనున్నారు.


Tags:    
Advertisement

Similar News