మార్చి 4న తెలంగాణకు ప్రధాని మోడీ.. సార్వత్రిక శంఖారావమేనా..?
గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణకు రానున్నారు. మార్చి 4, 5 తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.
అభివృద్ధి కార్యక్రమాలు, సభలు
మార్చి 4న ప్రధాని ఆదిలాబాద్‌కు రానున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆరోజు రాత్రికి హైదరాబాద్ తిరిగివచ్చి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. తర్వాత రోజు మార్చి 5న సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళతారు.
ఎన్నికల సన్నాహమేనా?
గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి మరిన్ని స్థానాల్లో గెలవాలని ప్రయత్నిస్తోంది. సికింద్రాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌ల్లో సిట్టింగ్‌లతోపాటు మరో మూడు స్థానాల్లో టికెట్లు ఖరారు చేసింది. మల్కాజ్‌గిరి, మెదక్, జహీరాబాద్ తదితర స్థానాలనూ గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. దానికి సన్నాహకంగానే ప్రధాని మోడీ సభలు, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి తెలంగాణ ప్రజలను కలవబోతున్నారు.