శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

దేశ రాష్ట్రపతులు శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రావడం 1950 నుంచి ఆనవాయితీగా ఉన్నది.

Advertisement
Update:2022-12-05 08:53 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తుండటంతో జీఏడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. అయితే ఆ మూడు రోజుల షెడ్యూల్ మాత్రం అధికారులు ప్రకటించలేదు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన పదవీ కాలంలో మూడు సార్లు శీతాకాల విడిది కోసం బొల్లారం వచ్చారు. 2017, 2018, 2019లో ఆయన హైదరాబాద్‌లో ఆయన గడిపారు. అయితే కరోనా కారణంగా 2020, 2021లో హైదరాబాద్ పర్యటనలు రద్దు చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత తాత్కాలిక విడిది కోసం నగరానికి రాష్ట్రపతి వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

దేశ రాష్ట్రపతులు శీతాకాల విడిది కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రావడం 1950 నుంచి ఆనవాయితీగా ఉన్నది. ప్రతీ ఏడాది చివర్లో రెండు నుంచి మూడు వారాల పాటు ఇక్కడ గడిపేవారు. కానీ ఆ తర్వాత 2-3 రోజులకు పర్యటన కుదించేసుకున్నారు. దేశంలో రాష్ట్రపతికి రెండు తాత్కాలిక విడిది భవనాలు ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్‌లో ఉండగా.. మరొకటి సిమ్లాలో ఉన్నది. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఒక విడిది ఏర్పాటు చేయాలని చాలా కాలంగా డిమాండ్ నెలకొన్నది.

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని నిజాం కాలంలో నిర్మించారు. ఆనాటి భవనాన్ని స్వాతంత్రం అనంతరం ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌కు అప్పగించారు. ఈ హెరిటేజ్ భవనం 90 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 1860లో కట్టిన ఈ భవనంలో 11 విలాసవంతమైన గదులు ఉన్నాయి. దీని ప్రాంగణంలో ఓ అందమైన పూల తోట కూడా ఉన్నది. సామాన్య ప్రజలు ఏడాదికి ఒకసారి ఈ తోటను సందర్శించడానికి అనుమతి ఇస్తారు. రాష్ట్రపతి ఇక్కడికి రాని రోజుల్లో కూడా భవనాన్ని నిత్యం సెక్యూరిటీ పహారా కాస్తుంటుంది.

Tags:    
Advertisement

Similar News