గ్రాడ్యుయేషన్ పరేడ్ లో రాష్ట్రపతి.. నేడు ఢిల్లీకి తిరుగు ప్రయాణం

శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పరేడ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.

Advertisement
Update:2023-06-17 10:39 IST

తెలంగాణ పర్యటనలో భాగంగా నేడు ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పరేడ్ కార్యక్రమానికి హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హైదరాబాద్‌ శివార్లలోని దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ లో ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ పరేడ్‌ కు రివ్యూయింగ్‌ అధికారిగా రాష్ట్రపతి ముర్ము రావడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌.. తదితరులు పాల్గొన్నారు.

పరేడ్ లో భాగంగా క్యాడెట్ల విన్యాసాలు ఆహుతుల్ని ఆకట్టుకున్నాయి. వివిధ విభాగాల క్యాడెట్లు పరేడ్ నిర్వహించారు. రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో మొత్తం 119 ఫ్లయింగ్‌ ఎయిర్‌ ట్రైనీలు, 75 మంది గ్రౌండ్‌ డ్యూటీ ట్రైనీ క్యాడెట్లు శిక్షణ పొందారు. 8 మంది క్యాడెట్లు ప్రత్యేక శిక్షణ పూర్తిచేసుకున్నారు. ప్రత్యేక్ష శిక్షణ పొందినవారిలో ఇద్దరు వియత్నాంకు చెందినవారు ఉండటం విశేషం. నేవీ, కోస్ట్ గార్డ్ కి చెందిన ఆరుగురికి కూడా ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.


అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలి..

శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలని చెప్పారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పరేడ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. క్యాడెట్ల తల్లిదండ్రులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అధికారులుగా బాధ్యతలు తీసుకోబోతున్నవారంతా.. విధి నిర్వహణలో సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సిరియా, టర్కీలో భూకంప సమయాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అందించిన సేవలు ప్రశంసనీయం అన్నారు. కొవిడ్ సమయంలో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అద్భుతంగా పనిచేసిందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాష్ట్రపతి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. 

Tags:    
Advertisement

Similar News