నేడే ఆఖరు.. మళ్లీ 4 నెలల తర్వాతే

ఈరోజు ఛాన్స్ మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేయడానికి 4నెలలు వేచి చూడాల్సిందే. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.

Advertisement
Update:2024-01-06 09:48 IST

కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నవారు దరఖాస్తు చేసుకోడానికి ఈరోజే ఆఖరు. ప్రజా పాలన దరఖాస్తులను డిసెంబర్ 28నుంచి స్వీకరిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలనుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు కోటికి పైగా దరఖాస్తులు వచ్చాయని సమాచారం. ఈరోజుతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య మరింత పెరుగుతుందని అంటున్నారు. చివరిరోజు తాకిడి ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా మరిన్ని కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

మళ్లీ నాలుగు నెలల తర్వాతే..

ఈరోజు ఛాన్స్ మిస్సయితే మళ్లీ దరఖాస్తు చేయడానికి 4నెలలు వేచి చూడాల్సిందే. ప్రతి నాలుగు నెలలకోసారి ప్రజా పాలన దరఖాస్తులు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. అదే సమయంలో దరఖాస్తు గడువుని పెంచే ఆలోచన లేదని ప్రభుత్వ యంత్రాంగం తేల్చి చెప్పింది.

ఈరోజునుంచే డేటా ఎంట్రీ..

దరఖాస్తుల స్వీకరణకు ఈరోజు చివరి రోజు. ఇవాళ్టి నుంచే దరఖాస్తుల ఆన్ లైన్ కార్యక్రమాన్ని కూడా మొదలు పెడుతున్నారు. ఈనెల 6 నుంచి 17 వరకు దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ ఉంటుందని చెప్పారు సీఎస్ శాంతి కుమారి. ఈనెల 17 లోపు దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. మండల కేంద్రాల్లోనూ డేటా ఎంట్రీ ప్రక్రియ ఉంటుందన్నారు. డేటా ఎంట్రీ కోసం ఈనెల 4న రాష్ట్రస్థాయి సిబ్బందికి, 5వతేదీ జిల్లా స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఆధార్‌, రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేస్తామన్నారు.

హైదరాబాద్ పరిధిలో..

హైదరాబాద్ పరిధిలోని 150 వార్డుల్లోని 600 ప్రాంతాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. శుక్రవారం నాటికి 21,52,178 దరఖాస్తులు అందాయి. వీటిలో 4,53,100 వరకు కొత్త రేషన్‌ కార్డు, ఇతరత్రా అర్జీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 30 శాతం పాత బస్తీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌ నుంచి అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. 

Tags:    
Advertisement

Similar News