'ప్రజాపాలన' మొదలు.. బీఆర్ఎస్ నేతల్లో కూడా హుషారు

మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు ప్రజలు. ప్రజాపాలనకు తొలిరోజు పోటెత్తారు.

Advertisement
Update:2023-12-28 13:21 IST

తెలంగాణలో నేటి నుంచి 'ప్రజా పాలన' కార్యక్రమం మొదలైంది. అధికార పార్టీ నేతలు, అధికారులు.. గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో కూడా నేతలు హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేతలు కూడా అధికారిక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. హైదరాబాద్ లో జరిగిన 'ప్రజాపాలన' కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అభయహస్తంలో పైరవీలకు అవకాశం లేదన్నారు మంత్రి పొన్నం. ఈరోజు నుంచి జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని చెప్పారు.

రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో 'ప్రజాపాలన' దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ప్రజల చేత ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం తమది అన్నారు. ప్రజాపాలన అందిస్తామని చెప్పి ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు భట్టి.

మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతిపత్రాలు, ఫిర్యాదులు అందజేస్తున్నారు ప్రజలు. ప్రజాపాలనకు తొలిరోజు పోటెత్తారు. మరోవైపు అభయహస్తం దరఖాస్తు ఫామ్‌ లు అందడం లేదని పలు చోట్ల ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ దరఖాస్తులను ఉచితంగా అందజేస్తుండగా.. కొంతమంది జిరాక్స్‌ సెంటర్ల వద్ద రూ.50 నుంచి రూ.100కు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News