మూడో రోజుకు ప్రజాపాలన.. ప్రజల్లో తొలగని సందేహాలు..!

రైతుబంధు స్థానంలో కాంగ్రెస్‌ తీసుకువచ్చిన రైతుభరోసా కోసం మళ్లీ అప్ల‌య్‌ చేసుకోమనడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒకే ఇంట్లో ఒకరికి మించి వ్యక్తులపై భూమి ఉంటే దరఖాస్తు చేసుకోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Advertisement
Update:2023-12-30 11:48 IST

తెలంగాణ ప్రభుత్వం వివిధ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం మూడోరోజుకు చేరుకుంది. రేషన్‌కార్డులతో పాటు ఆరు గ్యారంటీల కోసం మొదటి రెండు రోజుల్లోనే దాదాపు 15 లక్షల 59 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. తొలిరోజు 7 లక్షల 46 వేల దరఖాస్తులు రాగా.. రెండో రోజు దాదాపు 8 లక్షలకుపైగా అప్లికేషన్లు వచ్చాయి.

అయితే దరఖాస్తుదారులు ఇప్పటికీ పలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తు ఫామ్‌లో బ్యాంకు ఖాతా వివరాలు అడగకపోవడంతో పెన్షన్‌దారులు, రైతుబంధు లబ్ధిదారుల్లో సందేహాలు నెలకొన్నాయి. బీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు బ్యాంకు ఖాతాల్లో లేదా పోస్టాఫీసు ఖాతాల్లోనూ నేరుగా జమయ్యేవి. ఇక రైతుబంధు సైతం నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లో జమయ్యేది.

రైతుబంధు స్థానంలో కాంగ్రెస్‌ తీసుకువచ్చిన రైతుభరోసా కోసం మళ్లీ అప్ల‌య్‌ చేసుకోమనడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒకే ఇంట్లో ఒకరికి మించి వ్యక్తులపై భూమి ఉంటే దరఖాస్తు చేసుకోవడం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఒకే అప్లికేషన్‌లో దరఖాస్తు చేసుకోవాలా..? వేర్వేరుగా అప్ల‌య్‌ చేసుకోవాలా..? అనే దానిపై క్లారిటీ లేదంటున్నారు. ఇక రైతుబంధు సాయం పొందుతూ గల్ఫ్‌ దేశాల్లో ఉన్నవారు లేదా అనారోగ్యం కారణంగా దరఖాస్తు చేసుకోలేని వారి పరిస్థితి ఏంటనేది ప్రశ్నగా మిగిలింది.

వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే ఇందుకోసం ఉపాధిహామీ కార్డు వివరాలు అడిగింది. వ్యవసాయ కూలీగా ఉండి ఉపాధి హామీ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలా.. చేసుకుంటే ఏ వివరాలు సమర్పించాలనేదానిపైనా సందేహాలు ఉన్నాయి. ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే FIR, జైలుకు వెళ్లిన సంవత్సరం లాంటి వివరాలు అడిగింది. అయితే ఉద్యమంలో చాలా మంది పాల్గొన్నప్పటికీ FIR నమోదుకానీ వారు ఉన్నారు. అలాగే సాంస్కృతిక కళారూపాల్లోనూ ఉద్యమానికి అండగా నిలిచినవారు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటనేదానిపైనా స్పష్టత లేదు.

Tags:    
Advertisement

Similar News