కాంగ్రెస్ నేతలకూ తప్పని కరెంటు కష్టాలు..

జీవన్ రెడ్డి వీడియో కూడా వైరల్ గా మారింది. విద్యుత్ సిబ్బందికి ఆయన ఫోన్ చేయడం, కరెంటివ్వండయ్యా అని చెప్పడం, ఇన్విటేషన్ కార్డుని విసనకర్రలా ఉపయోగించడం వంటి సన్నివేశాలు కామెడీగా మారాయి.

Advertisement
Update:2024-03-10 12:47 IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతల గురించి బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపణలు చేస్తోంది. రైతులకు కరెంటు సక్రమంగా ఇవ్వడం లేదని, గృహ వినియోగదారులు కూడా కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ఆరోపణలు ఖండిస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై స్పందించారు. కొంతమంది ఉద్యోగులు కావాలనే కరెంటు కోతలు పెడుతూ ప్రభుత్వం పరువు తీయాలని చూస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. కరెంటు కోతల విషయంలో తమ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందన్నారు రేవంత్ రెడ్డి. కానీ వాస్తవం వేరేలా ఉంది. కరెంటు కోతలతో కాంగ్రెస్ నేతలే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఉంది.

తాజాగా జగిత్యాలలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమయానికి కరెంటు సరఫరా లేకపోవడంతో మైకు మూగబోయింది. ఆయన గంటల తరబడి వేచి చూశారు. విద్యుత్ సిబ్బందితో స్వయంగా ఫోన్ లో మాట్లాడినా సమస్య పరిష్కారం కాలేదు. కార్యక్రమం ముందుకు సాగక, కరెంటు కష్టాలను బయటకు చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు సతమతం అయ్యారు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా జరిగి ఉంటే కాంగ్రెస్ చేసే హడావిడి ఎవరూ ఊహించలేంటున్నారు ఎమ్మెల్సీ కవిత. కాసేపు కరెంటు లేకపోతేనే జీవన్ రెడ్డి అల్లాడిపోయారని, మరి కరెంటు పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల పరిస్థితి ఏంటో ఆలోచించాలని ఆమె సెటైరిక్ గా ట్వీట్ వేశారు.


గతంలో మంత్రి సీతక్క కార్యక్రమంలో కూడా ఇలాగే జరిగింది. సమావేశం మధ్యలో కరెంటు రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు, చప్పట్లు కొట్టారు. ఆ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. ఇప్పుడు జీవన్ రెడ్డి వీడియో కూడా ఇలాగే వైరల్ గా మారింది. విద్యుత్ సిబ్బందికి ఆయన ఫోన్ చేయడం, కరెంటివ్వండయ్యా అని చెప్పడం, ఇన్విటేషన్ కార్డుని విసనకర్రలా ఉపయోగించడం వంటి సన్నివేశాలు కామెడీగా మారాయి. మొత్తమ్మీద కరెంటు కోతలు సామాన్య ప్రజలు, రైతులకే కాదు.. కాంగ్రెస్ నేతలను కూడా ఇబ్బంది పెడుతున్నాయి. 

Tags:    
Advertisement

Similar News