డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాల్లోనే విద్యుత్ సంక్షోభం : మంత్రి కేటీఆర్
విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు ఎక్కువని చెప్పారు
డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని బీజేపీ ప్రచారం చేసుకుంటూ ఉంటుంది. అవన్నీ అబద్దాలే అని నిరూపించే గణాంకాలు ఇటీవల బయటకు వచ్చాయి. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎంత వెనుకబడ్డాయో ఈ నివేదికలో తెలిసింది. దీనిపై తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎక్స్(ట్విట్టర్)లో స్పందించారు.
విద్యుత్ లోటు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే విద్యుత్ లోటు ఎక్కువని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కాక ముందు 2013-14లో రాష్ట్రంలో విద్యుత్ లోటు ఉండేది. కానీ ఇవ్వాళ దేశంలో మిగులు విద్యుత్ మాత్రమే కాకుండా.. తలసరి వినియోగంలో కూడా తెలంగాణ నంబర్ 1న నిలిచిందని కేటీఆర్ చెప్పారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ వినియోగం ఇంతలా లేదని.. కేవలం 9 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ స్థాయికి చేరుకుందని కేటీఆర్ చెప్పారు. అంతే కాకుండా వ్యవసాయానికి రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణే అని అన్నారు. ప్రస్తుతం ఇండియాలో తెలంగాణ మోడల్ పాలనే నంబర్ 1 అని.. తెలంగాణ మోడల్ అభివృద్ధిని అందరూ కోరుకుంటున్నారని కేటీఆర్ వివరించారు.
కాగా, మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్‌లో ఒక చార్ట్‌ను కూడా జత చేశారు. ఇందులో హర్యానా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేవ్, బీహార్, అస్సాం రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఉన్నట్లు తెలుస్తున్నది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ లోటు మరింతగా పెరిగింది.