13ఏళ్ళ నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహి.... రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ లో చేరిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడులో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఆయనను ద్రోహిగా, నీచుడిగా వర్ణిస్తూ వేసిన ఈ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి.

Advertisement
Update:2022-08-13 11:56 IST

మునుగోడు నియోజకవర్గంలో రాత్రికి రాత్రే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కాంట్రాక్టుల కోసం 13ఏళ్ళ నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అంటూ ఈ పోస్టర్లలో ఆరోపించారు. 22 వేల కోట్ల కాంట్రాక్టు కోసం పార్టీని వదిలిపెట్టావు.. సోనియా గాంధీని ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరాలాడుకున్న నీచుడివి..మునుగోడు నిన్ను క్షమించదు అని వీటిలో ముద్రించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వర్గీయులే ఈ పోస్టర్లను ముద్రించారని రాజగోపాలరెడ్డి మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. రేవంత్ కి బుద్ధి చెబుతామని వారు హెచ్చరిస్తున్నారు. శనివారం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఈ పోస్టర్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

పాదయాత్రకు సహకరించబోను.. వెంకటరెడ్డి

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న పాదయాత్రకు సహకరించబోనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. రేవంత్ క్షమాపణను తేలిగ్గా తీసుకున్న ఆయన.. అద్దంకి దయాకర్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాతే ఈ అపాలజీపై స్పందిస్తానని చెప్పారు. అప్పటివరకు తన ఆగ్రహం చల్లారదని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇక అద్దంకి దయాకర్.. మరోసారి వెంకటరెడ్డికి క్షమాపణలు చెబుతున్నానని, భవిష్యత్తులో ఇలాంటిది పునరావృతం కాబోదని అన్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఇదివరకే లిఖితపూర్వక క్షమాణప చెప్పానని ఆయన గుర్తు చేశారు. పార్టీకి నష్టం జరగకూడదని భావిస్తున్నా.. పార్టీతో కలిసి పని చేయడానికి వెంకటరెడ్డి ముందుకు రావాలని కోరుతున్నా అని ఆయన చెప్పారు. గతంలో మాట్లాడినవారిపైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నా అన్నారు. ఈ వ్యవహారంలో మరో సీనియర్ నేత రామిరెడ్డి దామోదరరెడ్డి జోక్యం చేసుకుంటూ.. వెంకటరెడ్డి, రేవంత్ మధ్య పంచాయితీ ఏమీ లేదని, పాదయాత్రకు సంబంధించిన అన్ని సమాచారాలూ వెంకటరెడ్డికి ఇస్తున్నామని చెప్పారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు సహజమని, అంతా సర్దుకుపోతారని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.




Tags:    
Advertisement

Similar News