పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలింది..

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది.

Advertisement
Update:2023-11-30 06:56 IST

తెలంగాణలో పోస్టల్ బ్యాలెట్ల లెక్క తేలింది. కొంతమందికి పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వలేదని, ఉపాధ్యాయులకు కూడా ఓటు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. ఓటు హక్కు గురించి అందరికీ చెప్పే ఉపాధ్యాయులకే ఓటు లేదంటే అది మరింత దారుణం అంటూ కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గొడవ చేశాయి. ఈసీకి ఫిర్యాదు చేశాయి. చివరిగా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ఈసీ వివరణతో సంతృప్తి చెందింది, కేసుని మూసివేసింది.

ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు సుమారు 1.75 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేసామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఈసీ అధికారుల నిర్లక్ష్యం లేదని చెప్పింది.

పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ఎన్‌ సురేష్, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వలేదని, కొన్ని జిల్లాల్లో ఈసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించార‌ని చెప్పారు. ఈసీ తరపున సీనియర్‌ న్యాయవాది అవినాష్ దేశాయ్‌ వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్‌ బ్యాలెట్లు అందజేశామని చెప్పారు. ఈనెల 28వ తేదీ నాటికి 1.75 లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే అనిల్‌ కుమార్‌ తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై వాదనలు విన్నది. ఈసీ వాదనలతో ఏకీభవించిన జడ్జిలు పిటిషన్‌ పై విచారణను మూసివేశారు. 

Tags:    
Advertisement

Similar News