తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌కు ఆహ్వానం
ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,కిషన్‌రెడ్డి లకు ఆహ్వానం
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఆహ్వానించారు.ఇదే అంశంపై కేసీఆర్ ను ఆహ్వానించడానికి ఎర్రవెల్లి లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ బృందాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మేల్యే జీవన్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు వంశీధర్ రావు తదితరులు..సాదర స్వాగతం పలికారు.తన నివాసానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు లంచ్ ఆతిథ్యమిచ్చి కేసీఆర్ గౌరవించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా ఢిల్లీ కేంద్రంగా జరిగిన ఉద్యమ జ్ఞాపకాలను ఇరువురు నేతలు నెమరు వేసుకున్నారు. అంతకుముందు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రభుత్వం ఆహ్వానించింది. హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్.. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను, దిల్‌కుషా అతిథిగృహంలో కిషన్‌రెడ్డిని కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానపత్రాలు అందజేశారు. మంత్రి వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఉన్నారు.
కేసీఆర్‌తో భేటీ అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రభుత్వం పక్షాన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్‌ను ఆహ్వానించాం. గవర్నర్, కిషన్‌రెడ్డిని కూడా ఆహ్వానించాం. మర్యాదపూర్వకంగా కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విగ్రహ రూపకల్పన అంశంపై కేసీఆర్‌తో చర్చ జరగలేదన్నారు. విగ్రహావిష్కరణకు రావాలో వద్దో కేసీఆర్ నిర్ణయించుకుంటారు. ఆయన రావాలని మేము కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.ఈ నెల 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనున్నది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్న సంగతి తెలిసిందే.