పొంగులేటి, జూపల్లితో ఈటల భేటీ.. మళ్లీ బండి లేకుండానే..!
ఈటల మాత్రం ఆ ఇద్దర్నీ రహస్యంగా కలిశారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో దాదాపు నాలుగు గంటల సేపు చర్చలు జరిగాయి. గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలంతా ఒకేచోటకు వచ్చి కలవడం విశేషం.
బీఆర్ఎస్ బహిష్కరించిన ఇద్దరు నేతల్ని తమవైపు తిప్పుకోడానికి బీజేపీ తంటాలు పడుతోంది. ఇప్పటికే ఓసారి చర్చలు జరిగాయి, మరోసారి చర్చలు మొదలయ్యాయి. గతంలో జరిగిన చర్చల విషయంలో తనకు సమాచారం లేదని ఉడుక్కున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. మరి ఈ సమావేశంలో కూడా ఆయనకు చోటు లేకుండా తానే అంతా నడిపిస్తున్నారు చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఇంతకీ ఈ ఆధిపత్యపోరు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.
రహస్య చర్చలు..
పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీఆర్ఎస్ బహిష్కృత నేతలే. వారిద్దర్నీ పార్టీలోకి ఆహ్వానించాలంటే అంత రహస్యంగా కలవాల్సిన అవసరం లేదు. కానీ ఈటల మాత్రం ఆ ఇద్దర్నీ రహస్యంగా కలిశారు. హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్ హౌస్ లో దాదాపు నాలుగు గంటల సేపు చర్చలు జరిగాయి. గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతలంతా ఒకేచోటకు వచ్చి కలవడం విశేషం.
ఇటీవల ఖమ్మంలో పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ నేతలు.. పొంగులేటితోపాటు, జూపల్లి కృష్ణారావుతోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే చర్చల తర్వాత ఇద్దరూ మాట దాటవేశారు. ఎన్నికలకింకా సమయం ఉందని, ఏ పార్టీలో చేరాలనేది ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని వారిద్దరూ ప్రకటించారు. తక్కువ సమయంలోనే మరోసారి వీరిద్దరితో ఈటల భేటీ కావడం విశేషం. జూపల్లి, పొంగులేటిని బీజేపీలోకి తేవాలని ఈటల చూస్తుంటే.. ఈటలతో సహా అందరూ కాంగ్రెస్ లోకి వచ్చేయండని రేవంత్ రెడ్డి ఆఫర్ ఇస్తున్నారు. ఎన్నికలనాటికి అసలు ఎవరు ఏపార్టీలో ఉంటారో, ఎవరితో పోటీపడతారో అనేది ఆసక్తిగా మారింది.