ఐటీ ఉద్యోగులకు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్.. సైబరాబాద్ పరిధిలో ధర్నాలు చేస్తే కఠిన చర్యలు

ఆందోళనలు ఫలానా ప్రాంతాల్లో జరుగుతున్నాయని, ఇందులో పాల్గొనాలని సోషల్ మీడియాలో షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
Update:2023-09-15 13:30 IST

హైదరాబాద్‌లో వివిధ కంపెనీల్లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులకు పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పరిధిలో నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు. సైబరాబాద్ పరిధిలోని రోడ్లు, ఫ్లైవోవర్లు, ఓఆర్ఆర్ దగ్గర ఎవరైనా ధర్నా, నిరసనలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు మాధాపూర్ డీసీపీ సందీప్ ఒక ప్రకటన విడుదల చేశారు.

ప్రజలకు ఇబ్బంది కలిగేలా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ ధర్నాలు చేసినా.. న్యూసెన్స్‌కు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. ఇప్పటికే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్న వారిని, రెగ్యులర్‌గా న్యూసెన్స్ చేస్తున్న వారిని ముందస్తుగా అరెస్టు చేశామని డీసీపీ పేర్కొన్నారు. ఇలాంటి వారి మాటలకు లొంగి ఇతరులు ఎవరూ నిరసనల్లో పాల్గొనరాదని.. అలా వెళ్లిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ధర్నాలు, నిరసనల్లో పాల్గొనే ఐటీ, ఇతర ఉద్యోగుల సంస్థలకు కూడా నోటీసులు జారీ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. తమ ఉద్యోగులు సామాన్య ప్రజానికానికి, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలని పోలీసులు సూచించారు.

కాగా, ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత కొంత మంది హైటెక్ సిటీ పరిసరాల్లో నిరసనలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానాక్‌రామ్ గూడ ప్రాంతాల్లో ఇలాంటి నిరసనలు ఎక్కువగా ఉండటంతో ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు విధించినట్లు తెలుస్తున్నది.

శుక్రవారం కూడా సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలకు ఐటీ ఉద్యోగులు కొందరు పిలుపునిచ్చారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా డీసీపీ హెచ్చరికలు జారీ చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళనలు చేపట్టడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఆందోళనలు ఫలానా ప్రాంతాల్లో జరుగుతున్నాయని, ఇందులో పాల్గొనాలని సోషల్ మీడియాలో షేర్ చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News