గ్యాంగ్‌ రేప్ వీడియోను తీసేయండి.. ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసుల నోటీసులు

అప్రమత్తమైన సిటీ పోలీసులు సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు పంపారు. వెంటనే సదరు లింక్స్‌ను ఇన్‌స్టా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఇక సదరు వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నారు.

Advertisement
Update:2022-08-03 10:11 IST

జూబ్లీహిల్స్ ఇన్నోవా పబ్ నుంచి బాలికను కారులో తీసుకొని వెళ్లి ఐదుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన జరిగిన ఇప్పటికే రెండు నెలలు గడిచింది. ఈ సామూహిక లైంగిక దాడి నిందితుల్లో నలుగురు మైనర్లు కావడం, ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ అవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే, ఆ ఘటనకు చెందిన వీడియోలు, ఫొటోలు ఇంకా సోషల్ మీడియాలో హల్‌‌చల్ చేస్తుండటం బాధితురాలిని, వారి కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేస్తోంది.

సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలు, వీడియోల లింకులను గుర్తించిన బాధితురాలి కుటుంబం కొన్ని రోజుల క్రితం ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులకు అందించారు. దీంతో అప్రమత్తమైన సిటీ పోలీసులు సోషల్ మీడియా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌కు నోటీసులు పంపారు. వెంటనే సదరు లింక్స్‌ను ఇన్‌స్టా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఇక సదరు వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేసిన వారిని గుర్తించి కేసు నమోదు చేయనున్నారు.

బాధితురాలి కుటుంబం రెండు వీడియోలతో పాటు కొన్ని ఫొటోలను గుర్తించారు. అందులో బాధితురాలితో పాటు నిందితులైన మైనర్ల ముఖాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ఫొటోలో బాధితురాలి మెడపై ఉన్న పంటి గాట్లు కనపడుతుండగా.. ఆ ఫొటో కింది అసభ్యకరంగా క్యాప్షన్ పెట్టారు. ఇంకో ఫొటోతో పాటు రెండు వీడియోల్లో బాలిక గౌరవానికి భంగం కలిగించేలా మైనర్లు ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా అందులో బాధితురాలు, నిందితుల ముఖాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ వీడియోలు ఏ ఐడీ నుంచి అప్‌లోడ్ అయ్యాయో కూడా పోలీసులు గుర్తించారు. జూన్ 3, 4వ తేదీల్లో వీటిని అప్‌లోడ్ చేశారని.. అంతే కాకుండా వీడియోలకు ఒక వాయిస్ ఓవర్ కూడా జత చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. చాలా మంది ఈ వీడియోలను చూడటమే కాకుండా అసభ్యకరంగా కామెంట్లు కూడా చేశారు. 2000 మంది యూజర్లు ఈ వీడియోను చూశారని పోలీసులు అంటున్నారు. హైదరాబాద్ సిటీ పోలీసులు ఇప్పటికే ఈ ఉదంతంపై ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాసినట్లు ఉమెన్ సేఫ్టీ వింగ్ స్పష్టం చేసింది.

సైబర్ క్రైమ్ పోలీసుల సహాయం కూడా తీసుకొని ఇంకా ఈ వీడియోలు, ఫొటోలు ఎక్కడెక్కడ షేర్ అయ్యాయో గుర్తించి ఇన్‌స్టాతో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఉన్న వాటిని కూడా డిలీట్ చేయాలని ఉమెన్ సేఫ్టీ వింగ్ భావిస్తోంది. గతంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో వీడియోలు అప్‌లోడ్ చేసిన నలుగురు యూజర్లపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

వీడియోలు, ఫొటోలు అప్‌లోడ్ చేసిన వారిపై ఐపీసీతోపాటు జువైనల్ జస్టిస్ యాక్ట్‌ కింద కూడా సుమోటోగా కేసులు నమోదు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. ఇప్పటికే ఒక నిందితుడిపై కేసు నమోదు చేసి, నోటీసులు జారీ చేశామని ఆయన అన్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నామని అన్నారు.

Tags:    
Advertisement

Similar News