ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిన ప్రొఫెసర్‌..!?

2022లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని బయటకు చెప్పకపోవడం, నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎవరికీ ఈ విషయాన్ని తెలియజేయకపోవడం గమనార్హం.

Advertisement
Update:2023-06-16 10:36 IST

ప్రొఫెసర్‌ హరగోపాల్‌, తెలుగు సమాజంలో పరిచయం అక్కర్లేని పేరు. అధ్యాపకుడిగానే కాదు, హక్కుల కార్యకర్తగా దేశమంతా తన గళాన్ని వినిపించే మేధావి. మావోయిస్టు పార్టీతో చర్చల కోసం ఈ ప్రొఫెసర్‌ని గతంలో ప్రభుత్వం అనేక సార్లు రాయబారానికి పంపింది. మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన అధికారులను విడిపించేందుకు ఎన్నోసార్లు హరగోపాల్‌ కృషి చేశారు. ఇప్పుడు అలాంటి వ్య‌క్తిపైన దేశద్రోహం కేసు నమోదయ్యింది.

తెలుగు సమాజానికి కుట్ర కేసులు సుపరిచితమే. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలతో గడిచిన యాభై ఏళ్లలో ఉద్యమకారులపై ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ ఒరవడి కొత్త పుంతలు తొక్కుతోంది. ములుగు జిల్లా తాడ్వాయి స్టేషన్‌ పరిధిలో నమోదైన తాజా కేసే అందుకు నిదర్శనం. ఒక్కరిద్దరు కాదు.. ఏకంగా 152 మందిపై దేశద్రోహం కేసు నమోదయ్యింది.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టంతో పాటు, ఐపీసీలోని 10 వేరు వేరు సెక్షన్‌ల కింద హక్కుల కార్యకర్తలు, ప్రజా సంఘాల నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ పద్మజాషాతో పాటు 150 మంది పేర్లున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరు ప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం, ప్రభుత్వాన్ని కూలదోయడం, వంటి పనులు చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు.

2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌, ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌, ప్రొఫెసర్‌ పద్మజాషా, ముంబై హైకోర్టు జడ్జిగా పనిచేసిన సురేశ్‌, అరుణోదయ గౌరవాధ్యక్షురాలు విమల, ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య తదితరులు పేర్లు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే కేసులో నిందితుడిగా పేర్కొన్న జస్టిస్‌ సురేశ్‌ ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేనాటికే చనిపోయారు.

2022లో కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని బయటకు చెప్పకపోవడం, నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎవరికీ ఈ విషయాన్ని తెలియజేయకపోవడం గమనార్హం. పీపుల్స్‌ డెమొక్రటిక్‌ మూవ్‌మెంట్‌ అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల కింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా అతడిపై మరిన్ని కేసులు ఉన్నాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో ఎన్ని కేసులున్నాయో వివరాలు ఇవ్వాలని ఆదేశించడంతో తాడ్వాయి పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు బయటకు వచ్చింది. మొత్తం 152 హక్కుల కార్యకర్తలు, ఉద్యమకారులపై నమోదైన ఈ కేసుతో తెలుగు సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

తాడ్వాయి స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూబింగ్‌కు వెళ్లినట్లు, తమను చూసి మావోయిస్టులు అడవిలోకి పారిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమావేశ స్థలంలో మావోయిస్టు సాహిత్యంతో పాటు కొన్ని నోట్‌ బుక్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ నోట్‌ బుక్స్‌లో మావోయిస్టు పార్టీ ఫ్రాక్షన్‌ కమిటీ సభ్యులుగా 152 మంది పేర్లు ఉన్నాయని, వీరంతా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఆయుధాల ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కుట్ర పన్నారని పోలీసులు ఆరోపించారు. కాగా.. పోలీసుల తీరును హక్కుల సంస్థలు తప్పుబడుతున్నాయి. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకే ప్రభుత్వం ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తోందని ఆరోపిస్తున్నారు.

కాగా.. దేశద్రోహం లాంటి కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రొఫెసర్‌ హరగోపాల్‌ గుర్తు చేశారు. తమపై పెట్టిన కేసు చెల్లద‌న్నారు. చనిపోయిన వారిని కూడా కేసులో నిందితులుగా పేర్కొనడం విషాదమన్నారు. ప్రజాస్వామ్యంలో ఉపా లాంటా చట్టాలకు తావులేదన్నారు. ఈ కేసుకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పోరాడుతామన్నారు. అయినా.. మావోయిస్టులకు తమ మద్దతు అవరసం లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News