ఎస్సైకి వార్నింగ్.. అక్బరుద్దీన్ పై కేసు
అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఇలాంటి వాటికి బుల్డోజర్ రియాక్షన్ ఉంటుందని ట్వీట్ చేశారు.
రావు అయినా రెడ్డి అయినా మేం చెప్పినట్టు వినాల్సిందేనంటూ ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి అలాంటి మాటలతోనే పోలీసులకు బుక్కయ్యారు. ఆయనపై సంతోషన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకంగా ఎస్సైకే వార్నింగ్ ఇవ్వడంతోపాటు, తన చుట్టుపక్కల ఉన్నవారిని రెచ్చగొట్టేలా ప్రసంగించడంతో పోలీసులు కేసు పెట్టారు.
నన్ను ఆపేవాళ్లింకా పుట్టలేదు..
లలితాబాగ్ లో గత రాత్రి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు అక్బరుద్దీన్. ప్రచార సమయం పూర్తయిందని, ఇక మైకు ఆపేయాలంటూ స్థానిక ఎస్సై ఆయనకు సూచించారు. దీంతో అక్బరుద్దీన్ రెచ్చిపోయారు. తన దగ్గర వాచ్ ఉందని, ఇంకా టైమ్ ఉందని బెదిరింపు ధోరణిలో సమాధానమిచ్చారు. అంతే కాదు.. నువ్విక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఆయనకు చేయి చూపిస్తూ మీదకు దూసుకెళ్లబోయారు. తనను ఆపేవాళ్లింకా పుట్టలేదని, తనను ఆపే దమ్ము ఎవరికీ లేదన్నారు అక్బరుద్దీన్. నేను ఒక్క సైగ చేస్తే ఇక్కడ ఉన్న అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైకు వార్నింగ్ ఇచ్చారు.
అక్బరుద్దీన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. బీజేపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఇలాంటి వాటికి బుల్డోజర్ రియాక్షన్ ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు డీసీపీ రోహిత్ రాజు వెల్లడించారు.
♦