పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్నరు
ఏ అర్హత ఉందని తిరుపతి రెడ్డి లగచర్లకు పంపుతరు : పోలీసులపై కేటీఆర్ ఫైర్
పోలీసులు రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలా పని చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆయన బుధవారం పరామర్శించారు. ఆయన తల్లి, సతీమణి, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కొడంగల్ రైతులకు అండగా ఉన్నందుకు మఫ్టీలో వచ్చిన పోలీసులు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని తెలిపారు. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ లగచర్లకు పోతుంటే పోలీసులు అడ్డుకున్నారని, ఏ అర్హత ఉందని రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డిని లగచర్లకు వెళ్లనిచ్చారని ప్రశ్నించారు. తిరుపతి రెడ్డి లగచర్లకు వెళ్లి అక్కడి ప్రజలను బెదిరిస్తున్నారని తెలిపారు. కలెక్టర్, అధికారులపై దాడి చేశారని రైతులను అరెస్ట్ చేసి కొట్టారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పోలీసులు రేవంత్ కోసం పని చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ అల్లుడి కోసం పేదల భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. అధికారులు అతి చేస్తే ఏపీలో ఏం జరిగిందో చూస్తున్నామని.. తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రైతుల అరెస్టులు, అక్రమ నిర్బంధాలపై జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కొడంగల్ ఘటనలపై స్పందించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలువాలన్నారు. 11 నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. రేవంత్ సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుందని.. ఢిల్లీ పెద్దలకు కోపం వస్తే ఖతం అన్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదన్నారు. అరెస్ట్ చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఫార్మా విలేజ్ పేరుతో రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ దందా చేయాలని చూస్తున్నారని తెలిపారు. కలెక్టర్ తమపై దాడి జరగలేదని చెప్తున్నారని, అలాంటప్పుడు కేసులు ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.