3 రోజులు, 6 సభలు.. మోడీ ప్రచార షెడ్యూల్ ఇదే..!

25వ తేదీ మధ్యాహ్నం 1.25 గంట‌ల‌కు మోడీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్తారు.

Advertisement
Update:2023-11-23 08:08 IST

అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణలో ప్రధాని మోడీ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఫైనల్ అయింది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున మోడీ ప్ర‌చారం ప్రచారం నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం ఆరు బహిరంగ సభలతో పాటు హైదరాబాద్‌లో రోడ్‌షోలో పాల్గొంటారు. ఒకరోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనుండగా.. మరో రోజు తిరుమలకు వెళ్లి రానున్నారు.

25వ తేదీ మధ్యాహ్నం 1.25 గంట‌ల‌కు మోడీ హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్తారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి మద్దతుగా నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. సాయంత్రం మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌కు మద్దతుగా బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత రాజ్‌భవన్‌ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఇక 26న ఉదయం 11.30 గంట‌ల‌కు హైదరాబాద్‌ సమీపంలోని కన్హా శాంతివనంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. మధ్యాహ్నం తూప్రాన్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రం నిర్మల్ సభలో ఏలేటి మహేశ్వర్‌ రెడ్డికి మద్దతుగా బహిరంగసభలో ప్రసంగిస్తారు. సాయంత్రం హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని తిరుమలకు వెళ్తారు.

27న ఉదయం స్వామి వారి దర్శనానంతరం తిరుపతి నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు మోడీ. అక్కడి నుంచి మహబూబాబాద్‌ చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. తర్వాత కరీంనగర్‌లో బండి సంజయ్‌కు మద్దతుగా బహిరంగసభలో పాల్గొంటారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌ చేరుకోనున్న ప్రధాని.. రోడ్‌ షోలో పాల్గొంటారు. కాగా, హైదరాబాద్‌లో రోడ్‌ షో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహించాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. రోడ్‌ షో అనంతరం తిరిగి ఢిల్లీకి పయనమవుతారు ప్రధాని మోడీ.

Tags:    
Advertisement

Similar News