G-20 లోగోకి ప్రశంస.. జీఎస్టీ బాదుడుపై మౌనం
నేతన్నల పనితీరుని ప్రశంసించిన మోదీకి, వారి కష్టాలు ఎందుకు గుర్తు రావడంలేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పన్నుబాదుడు నుంచి తప్పించాలని, ప్రోత్సాహం అందించాలని వారు గుర్తు చేస్తున్నారు.
తెలంగాణకు చెందిన చేనేత కార్మికుడిని ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ పనితీరుని ఆయన కొనియాడారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రత్యేకంగా హరిప్రసాద్ గొప్పతనాన్ని ప్రస్తావించారు. హరిప్రసాద్ కళా నైపుణ్యం అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో ఉందని కితాబిచ్చారు.
హరిప్రసాద్ ఏం చేశారు..?
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ G-20 లోగోని చేనేత మగ్గంపై తయారు చేశారు. మూడు రోజులపాటు శ్రమించి ఆయన ఈ లోగోని రూపొందించారు. అనంతరం దాన్ని ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. అంతర్జాతీయ సదస్సుకి భారత్ ఆతిథ్యం ఇవ్వడం గర్వించదగ్గ విషయం అంటూ ఓ లేఖను కూడా రాశారు. తెలంగాణ చేనేత కార్మికుల నైపుణ్యానికి మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కేలా చేశారు హరిప్రసాద్. ఈయన గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీర, దబ్బనం, సూది రంధ్రాల్లో దూరే చీరలను నేశారు. ఇటీవల 15 రోజులపాటు శ్రమించి ఒకే వస్త్రంపై ఇండియా మ్యాప్, జాతీయ గీతం రూపొందించారు. తాజాగా G-20 లోగోను చేనేత మగ్గంపై తయారు చేశారు.
ప్రశంస సరే, నేతన్నల కష్టాల సంగతేంటి..?
ప్రధాని మోదీ హరిప్రసాద్ సృజనాత్మకతను మెచ్చుకున్నంత మాత్రాన చేనేతల కష్టాలు తీరిపోతాయా..? ఆయన ప్రశంసించినంత మాత్రాన నేతన్నల కడుపు నిండుతుందా..? చేనేత ముడిపదార్థాలపై జీఎస్టీ బాదుడు ఎత్తివేయాలంటూ చాన్నాళ్లుగా నేతన్నలు వేడుకుంటున్నారు. ఆ భారం మోయలేమంటున్నారు. తమకు కూలీలు గిట్టుబాటు కావడంలేదంటున్నారు. నేతన్నల పనితీరుని ప్రశంసించిన మోదీకి, వారి కష్టాలు ఎందుకు గుర్తు రావడంలేదంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. పన్నుబాదుడు నుంచి తప్పిస్తే, ప్రోత్సాహం అందిస్తే.. మరిన్ని సంచలనాలు నమోదు చేయగలరు నేతన్నలు. కానీ కేంద్రం మాత్రం బాదుడే బాదుడు అంటోంది. ఇలాంటి ప్రశంసలు పైపై మెరుగులు. జీఎస్టీ బాదుడు నుంచి చేనేత రంగాన్ని తప్పిస్తేనే అది శాశ్వత మేలు అవుతుంది.